ప్రజాశక్తి -అనంతగిరి:తమ సాగు భూములు తమకే హక్కు కల్పించి, కేటాయించాలని కబ్జాకు పాల్పడిన భూస్వాములపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజన రైతులు అర్దనగనంగా వినూత్న రీతిలో చేతులు జోడించి కలెక్టర్‌ను వేడుకుంటూ నిరసన చేపట్టారు. మండలంలోని నాన్ షెడ్యూల్ రొంపల్లి పంచాయతీ కొండ శిఖరం గ్రామాలైన బూరిగ, చిన్నకోనల గ్రామాల భూ సాగు రైతులు గురువారం గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ సోమ్మెల అప్పలరాజు మాట్లాడుతూ, బూరిగ, చిన్నకోనల. గ్రామాలకు చెందిన 70 మంది రైతులు 105 ఎకరాల భూమిని తాత మూత్తాతల కాలం నుండి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. 2017 సంవత్సరంలో అప్పటి తహశీల్దార్, భూస్వాములతో కుమ్మకై గిరిజనేతరుల పేరు మీద ఆన్లైన్లో నమోదు చేశారన్నారు. దీనిపై సబ్ కలెక్టర్ కోర్టులో ఫిర్యాదు చేయడంతో ఆర్ ఓ ఆర్ కేసు కింద నమోదు చేశారన్నారు.చీఫ్ సెక్రటరీ కు కలిసి ఫిర్యాదు చేయగా ఈ భూముల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినప్పటికీ తమకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. అందుకే ఈ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని, లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యలయం వద్ద ఆందోళన చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బూరుగ. పెంటయ్య, సోమ్మెల .సన్యాసిరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.