రహదారి నిర్మాణ పనులు

Mar 10,2025 00:03

రోడ్డు సౌకర్యం లేక నిలిచిన గృహ నిర్మాణం

ప్రజాశక్తి- అనంతగిరి:ఇంటింటా చందాలు వేసుకొని రోడ్డు ఏర్పాటుకు గిరిజనులు నడుం బిగించారు. మండలంలోని మారుమూల కివర్ల పంచాయతీ పరిధి కొండ శిఖరు నక్కులమామిడి పివిటిజి గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేదు. ఎలాగైనా రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలన్న తపనతో ముందుకు వచ్చిన 63 పివిటిజి కుటుంబాలు ఇంటింటికి ఐదు వేల రూపాయలు చొప్పున చందాలు వేసుకున్నారు. మూడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని గ్రామస్తులు వి.రాజు వి.ఈశ్వరరావు, కిల్లో. కామేశ్వరావు లు అన్నారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను కలిసి లిఖితపూర్వకంగా విన్నవించామన్నారు. అంతే కాకుండా జిల్లా కలెక్టర్‌, ఐటిడిఎ. పి ఓ, గిరిజన మంత్రులకు కలిసి విన్నవించామని, అయినప్పటికీ కూడా కనీసం తమ గోడు వినే నాదుడే కరువయ్యారన్నారు. దీంతో తమ గ్రామంలో ఇల్లు నిర్మించుకోలంటే సామాగ్రితో పాటు నిత్యావసర సరుకులు భుజం పైన మోసుకొని మూడు కిలోమీటర్లు ఎత్తైన కొండ కోనల నడుము నుండి తరలించవలసి వస్తుందని తెలిపారు. నాలుగు నెలల క్రితం విద్యుత్‌ స్తంభాలు కూడా మోయవలసి వచ్చిందన్నారు. గర్భిణీ, బాలింత అనారోగ్యాలకు గురైతే రోగులకు వైద్యం కోసం డోలీ సహాయంతో మెయిన్‌ రోడ్డు వరకు తరలిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జన్‌ మన్‌ పథకం కింద మంజూరైన గృహాలు నిర్మించుకునేందుకు అవసరమైన సామాగ్రి రవాణాకు తీవ్ర ఇబ్బందికరంగా ఉందన్నారు. దీంతో ఇంటింటా చందాలు వేసుకుని మూడు కిలోమీటర్‌ మేర్ల మెయిన్‌ రోడ్డు నుండి తమ గ్రామం వరకు జెసిబి ద్వారా రోడ్డు పనులు మొదలుపెట్టి నేటికి వారం రోజులు కావస్తుందని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు

➡️