వారపు సంతకు సంక్రాంతి కళ

సంతకు తరలి వచ్చిన గిరిజనులు

ప్రజాశక్తి-హుకుంపేట: సంక్రాంతి పండుగ సందర్భంగా మండల కేంద్రంలోని శనివారం జరిగిన వారపు సంతకు భారీగా గిరిజనులు తరలివచ్చారు.కొత్త దుస్తులు, సామగ్రి కొనుగోలు చేసేందుకు పరిసర మండలాల్లో నుంచి కుటుంబ సమేతంగా గిరిజనులు రావడంతో సంత ప్రాంగణమంతా కిక్కిరిసింది. మెయిన్‌ రోడ్డు, పెట్రోల్‌ బంకు జంక్షన్‌ నుంచి కామయ్యపేట జంక్షన్‌ వరకు, జూనియర్‌ కాలేజ్‌ తదితర ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి. వస్త్ర వ్యాపారం భారీగా జరిగింది. గిరిజనులు పండించిన అటవీ ఉత్పత్తులను అమ్మకాలు చేపట్టి కుటుంబ సభ్యులకు వస్త్రాలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు. జైపూర్‌ నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా తుడుములు అమ్మకానికి తీసుకొచ్చారు. చిన్నది రూ.1800, పెద్దది 3000 వరకు అమ్మకాలు సాగాయి. గిరిజన ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా తుడుములను ఉపయోగిస్తారు. కోళ్లు మేకలు అమ్మకాలు భారీగా సాగాయి. నాటు కోటి, రూ.800 నుంచి 2000, మేకలు రూ. 7000 నుంచి 16000 వరకు విక్రయాలు సాగాయి. కూరగాయల కొనుగోలు భారీగా జరిగాయి.

➡️