ప్రజాశక్తి-డుంబ్రిగుడ:గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 భూ బదలాయింపు చట్టాన్ని ధిక్కరిస్తూ మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనేతరులు విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేసుకుం టున్నారు. మండలంలోని అరుకు, కురిడి, కించుమండ పంచాయతీ కేంద్రాల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు అక్రమంగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. చట్టానికి వ్యతిరేకంగా శాశ్వత గృహాలతో పాటు భవంతులను నిర్మిస్తున్నారు. ఆయా పంచాయతీ కేంద్రాల్లో పరదాల చాటున అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై స్థానిక గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోకుండా నిర్మాణాలు సాగిస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ యంత్రాంగం స్పందించి గిరిజనేతరుల అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపి నిలుపుదల చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై స్థానిక ఆర్‌ఐ రామును వివరణ కోరగా… కురిడిలో జరుతుతున్న అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేయడం జరిగిందని, కించుమండ, అరుకులో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై విచారణ చేపట్టి గిరిజనేతరులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.