కార్మికులకు పథకాలను అందించాలి

Oct 2,2024 00:30
మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:రాష్ట్ర ప్రభుత్వం 1214 సర్క్యులర్‌ రద్దు చేసి, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను అందించాలని సిఐటియు అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.అరకులోయ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భవన నిర్మాణం కార్మిక సంఘం, ఇతర కార్మిక సంఘాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం పెట్రోల్‌ బంక్‌ నుండి మండల తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేసిందని, 12 రకాల సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకు రాకుండా తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు. ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చిందని, దీన్ని నిలబెట్టుకోవాలన్నారు. వీటితో పాటు 60 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పెన్షన్‌, వికలాంగ పెన్షన్‌, చదువుకోవడానికి స్కాలర్షిప్‌ తదితర సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఎన్నికల ముందు ఇసుక ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలిపారు.పెండింగ్‌ లో ఉన్న లేబర్‌ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సంక్షేమ బోర్డును పునరుద్ధంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు గోవిందు, పెయింటింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కొండబాబు, కార్పెంటర్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రభుదాసు, శ్రీను, తాపీ మేస్త్రీల సంఘం నాయకులు సత్తిబాబు, రామ్‌ చందర, సోమినాయుడు, రాడ్‌ బెండర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️