భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

స్ట్రాంగ్‌ రూమును పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయ సునీత

ప్రజాశక్తి-పాడేరు : స్థానిక డిగ్రీ కళాశాలలో ఈవీఎంల భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూములను జిల్లా కలెక్టర్‌ ఎం విజయ సునీత బుధవారం సందర్శించారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గం, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం, అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం స్ట్రాంగ్‌ రూములను పరిశీలించి భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్‌ హాల్స్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. ప్రధాన రహదారిలో అదనపు విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్‌ ఏజెంట్లకు, అభ్యర్థులకు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉదయం అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి వి అభిషేక్‌ పాడేరు రిటర్నింగ్‌ అధికారి జాయింట్‌ కలెక్టర్‌ భావన వసిస్ట్‌ స్ట్రాంగ్‌ రూములను సందర్శించారు. లాగ్‌ బుక్‌ లో సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీలు ప్రతాప్‌ శివ కిషోర్‌, ధీరజ్‌,జిల్లా రెవెన్యూ అధికారి బి. పద్మావతి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వివిఎస్‌ శర్మ , పాడేరు తహాసిల్దార్‌ కళ్యాణ్‌ చక్రవర్తి , డి పి ఆర్‌ ఓ పి. గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

➡️