రోడ్డుపైనే మురుగునీరు

Jun 9,2024 00:01
రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న మురుగునీటిని దాటి వెళుతున్న పిల్లలు

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలోని కుమడ పంచాయతీ కేంద్రంలో మూడు రోడ్ల కూడలిలో డ్రైనేజీ లేక పోవడంతో రోడ్డుపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. శుక్రవారం సాయంత్రం సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా ఈదులుగాలతో కూడిన భారీ వర్షానికి వరద నీరు రోడ్డు పైకి చేరుకొని రోడ్డంతా అస్తవ్యస్తంగా మారింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెత్తా చెదారమంతా రోడ్డుపైకి రావడంతో పాదాచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో డ్రైనేజీ ఉన్నప్పటికీ సెల్‌ టవర్ల నిర్మాణాల కోసం వాటిని పూడ్చి వేశారు. డ్రైనేజీ మూసుకుపోయి వరద నీరంతా రోడ్లపైకి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. డ్రైనేజీ విషయమై అధికారులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ కనీసం స్పందించ లేదని వాపోయారు. చెత్తాచెదారం రోడ్డు పైకి రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని గ్రామస్తులు సింహాద్రి, జగదీష్‌, ఆదినారాయణ, ఆనందరావు, రమేష్‌ బాబు, భవాని శంకర్‌, సునీల్‌ కుమార్‌, సురేష్‌ కుమార్‌ తదితరులు కోరారు.

➡️