వణుకుతున్న మన్యం

Jan 16,2025 07:55 #Weather effect, #Winter session
రోడ్డును కమ్మేసిన పొగ మంచు

పొగ మంచుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
ప్రజాశక్తి-పాడేరు (అల్లూరి జిల్లా) : మన్యాన్ని చలి పులి వణికిస్తోంది. ఏజెన్సీ అంతటా ఉష్ణోగ్రత పది డిగ్రీలకు పడి పోయింది. రేయింబగళ్ళు దట్టంగా పొగ మంచు కురుస్తోంది. దీంతో, చలి మరింత అధికమవుతోంది. చలి తీవ్రతతో మన్య ప్రజలు గజగజ వణుకుతున్నారు. వేకువ జాము, ఉదయం పూట, రాత్రి వేళల్లో బయట ప్రదేశాల్లో పనులు నిర్వర్తించుకునే ప్రజలు పొగ మంచు తీవ్రతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఘాట్‌ ప్రయాణాల్లో వాహన చోదకులు పొగ మంచుతో రోడ్డు కానరాక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పగటిపూట కూడా వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్నం బారెడు పొతే వరకు ఎండా కానరాలేదు. మన్యం ప్రజలు మిట్ట మధ్యాహ్నంకి గాని ఎండను చూడలేని పరిస్థితి ఉంది. మన్యవాసులు చలి తీవ్రతతో ఉన్నివస్తాలు ధరించి.. నెగళ్లు వేసుకుని చలి మంటలతో ఉపశమనం పొందుతూ జీవనం సాగిస్తున్నారు. చలి వాతావరణంతో వచ్చే వ్యాధుల మూలంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆస్తమా ఇతర శ్వాసకోస వ్యాధులు ఉన్న రోగులకు ఈ చలి వల్ల ఇక్కట్లు తప్పడం లేదు. వాతావరణంలో జీవనం సాగించడం ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోందని వైద్యుల సూచన మేరకు రోగగ్రస్తులు మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లే పరిస్థితి పలువురు ఎదుర్కొంటున్నారు.

ఉన్ని వస్త్రాలకు గిరాకీ
ఉత్తరాంధ్రలో అతి శీతల ప్రాంతంగా ఉన్న పాడేరు, అరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్ని వస్త్రాలకు మంచి గిరాకీ ఉంది. ఈ సీజన్లో అక్టోబర్‌ నుంచి జనవరి వరకు సుమారు నాలుగు నెలల పాటు ఉన్ని వస్త్రాల వ్యాపారం భారీగా సాగుతోంది. నేపాల్‌ న్యూఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు రంగులు స్వెటర్లు ఇతర కొన్ని వస్త్రాలను ఇక్కడకు దిగుమతి చేసి విక్రయిస్తున్నారు నేరుగా ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడకు రవాణా చేస్తున్న కొన్ని వస్త్రాలు పెద్ద షాపుల్లో కంటే రోడ్ల పక్క దుకాణాలు వేసి కొంచెం తక్కువ ధరలకే విక్రయిస్తుండడం తో ఈ ప్రాంతంలో ప్రజలకు ఉన్ని వస్త్రాలు అందుబాటులోనే ఉంటుంది. రూ.300 నుంచి 3 వేల వరకు రగ్గులు స్వెటర్లు లభిస్తున్నాయి.

➡️