ప్రజాశక్తి-పాడేరు: సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాచిపెంట అప్పలనర్స సోమవారం పాడేరు మండలం మోదపల్లి పంచాయతీ, వంటల మామిడి పంచాయతీ ఓనూరు గ్రామంలో పర్యటించారు. పందిదూర్లు గ్రామంలో గ్రామ ప్రజలతో ర్యాలీ నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తున్నా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేపట్టలేదని విమర్శించారు. గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకున్న ఆయన తక్షణమే రహదారి సౌకర్యం కల్పించాలన్నారు. మంచినీటి కోసం అమ్మవారు పాదాల బ్రిడ్జి వద్ద కు వెళ్లాల్సిన వస్తోందన్నారు.ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జన్ మన్ ఇళ్లకు రెండు లక్షల 39000 చెల్లిస్తున్నారని, ఈ సొమ్ము ఎటు సరిపోదన్నారు.. ఆదిమ జాతికి చెందిన గిరిజనులు మారుమూల రోడ్డు లేని ప్రదేశాల్లో ఉంటారని,వారికి ఇస్తున్న రెండు లక్షల 39 వేలు ఇల్లు కట్టే సామగ్రికే సరిపోదన్నారు. ప్రస్తుతం ఇసుక, ఐరన్ రేటు పెరిగిందని, సిమెంట్ ధర కూడా పెరిగి పోయిందన్నారు. ఈ రేట్లతో ఇల్లు పూర్తి కావాలంటే కనీసం 10 లక్షలైనా ఖర్చవుతుందన్నారు. ఒక ఇల్లుకి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలామందికి అటవీ హక్కుల పట్టాలు లేవన్నారు. నూతనంగా పెళ్లయిన వారికి రేషన్ కార్డులు తక్షణమే ఇవ్వాలన్నారు. అర్హులైన వారికి అంత్యోదయ కార్డులు తక్షణమే ఇవ్వాలని తెలిపారు. ఈ నెల 12న చలో వంటలమామిడి సచివాలయం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం చేస్తామని తెలిపారు. సమస్యలపై దరఖాస్తులు రాసుకుని బుధవారం జరిగే వంటల మామిడి సచివాలయం కి రావాలని ఆయా పంచాయతీ గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పాలికి లక్కు, జిల్లా కమిటీ సభ్యులు వంతల దాసు, పాడేరు మండల కార్యదర్శి ఎం సుందర్రావు, జిల్లా నాయకులు గ్రామస్తులు నాగేశ్వరరావు, చిన్నారావ్, చిన్నయ్య, బాబురావు, మహిళలు విజయ, కమల పాల్గొన్నారు.
