గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

మాట్లాడుతున్న పిఒ అభిషేక్‌

ప్రజాశక్తి-పాడేరు:గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఐటిడిఏ పి.ఓ. వి.అభిషేక్‌ ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో ఒకే ప్రామాణికా విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. పది విద్యార్థుల వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని స్పష్టమై ఆదేశాలు జారీ చేసారు. సహాయ గిరిజన సంక్షేమాధికారులు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో ఐటిడిఏ సమావేశ మందిరంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు జారీ చేసిన ఫార్మాట్‌లో ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రతీ నెలా నివేదికలు సమర్పించాలని స్పష్టం చేసారు. విద్యార్ధులకు ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిక్‌ రూంలో ఉంచాలను సూచించారు. అత్యవసరమైతే వెంటనే అసుపత్రికి తరలించి తలిదండ్రులకు, ఎటిడబ్ల్యూఓలకు సమాచారం అందించాలని చెప్పారు. విద్యార్థుల తలిదండ్రులకు, గార్డియన్లకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. గుర్తింపు కార్డు కలిగిన వారితో విద్యార్ధులను బయటకు పంపించాలని చెప్పారు. ఆశ్రమ పాఠశాలల్లో విధిగా మూమెంట్‌ రిజిష్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తల్లిదండ్రులను, గార్డియన్లను అనుమతించాలన్నారు. అపరిచిత వ్యక్తులతో విద్యార్థులను బయటకు పంపించకూడన్నారు. పది విద్యార్ధుల వందరోజుల కార్యాచరణ ప్రణాళికను, స్టడీ మెటీరియల్‌ను విడుదల చేసారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల స్టడీ అవర్‌ నిర్వహించాలని చెప్పారు. వెనుక బడిన విద్యార్దులపై ప్రత్యేక దష్టి పెట్టి విద్యా సామర్థ్యాలు మెరుగు పరచాలని పేర్కొన్నారు. విద్యార్ధులు గంజాయి వినియోగిస్తే తగిన చర్యలు చేపట్టి కౌన్సిలింగ్‌ ఇప్పించాలని, తల్లిదండ్రులకు సమాచారం అందించాలని ఆదేశించారు. మార్గదర్శిని కార్యక్రమం అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలనపై కఠిన చర్యలు చేపట్టిందన్నారు. పాఠశాలలు, మండల స్థాయి, ఐటిడిఏ స్థాయిలో గంజాయి నిర్మూలనపై కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గంజాయి పండించినా తరలించినా, వినియోగించినా వెంటనే 1972 కాల్‌ సెంటర్కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎల్‌.రజని, డిఇ ఓ పి. బ్రహ్మాజీరావు, 11 మండలాల ఎటిడబ్ల్యూఓలు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు.

➡️