తాగునీటి బోరు ప్రారంభం

తాగునీటి బోరును ప్రారంభిస్తున్న సిపిఎం మండల కార్యదర్శి అర్జున్‌దొర

ప్రజాశక్తి-అల్లూరి జిల్లా

ఎటపాక మండలం లక్ష్మీపురం పంచాయతీ కేంద్రంలో ఆ గ్రామానికి చెందిన పూనెం వెంకట్రావు తన సొంత నిధులు రూ.80వేలు వెచ్చించి తాగునీటి బోరును ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సచివాలయం పక్కన ఉన్న 40 కుటుంబాలకు తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. తమకు తాగునీటి సౌకర్యం కల్పించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఏ ఒక్కరూ స్పందించలేదు. దీంతో ఆ గ్రామంలో నివాసముంటున్న పూనెం వెంకట్రావు గ్రామస్తుల దాహార్తిని తీర్చడానికి తన సొంత నిధులు 80వేలు ఖర్చు చేసి చేతి పంపును ఏర్పాటు చేశారు. ఈ తాగునీటి బోరును సిపిఎం మండల కార్యదర్శి కాకా అర్జున్‌ దొర మంగళవారం ప్రారంభించారు. మంచినీటి బోరు ఏర్పాటు చేసిన పూనెం వెంకట్రావును పలువురు అభినందించారు. ఈ సందర్భంగా కాకా అర్జున్‌ మాట్లాడుతూ గ్రామ సచివాలయానికి పక్కనే ఉన్న కుటుంబాలకు తాగు నీరు అందక ఇబ్బంది పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని, ఒక వ్యక్తి చేసిన పని వ్యవస్థ చేయలేకపోతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుండే కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సవలం రాము, నాయకులు నక్క సూరిబాబు, సోందే రమేష్‌, తెల్లం జంపయ్య, వాసం ధర్మరాజు, బుద్ధుల జానకి, సున్నం రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

➡️