మహా శివరాత్రి జాతరకు పటిష్ట ఏర్పాట్లు –

Feb 15,2025 00:15
సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: ప్రముఖ శైవ క్షేత్రం మత్స్యగుండం మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఈనెల 25, 26, 27 తేదీలలో మూడు రోజులు పాటు నిర్వహించనున్న మత్స్యగుండం జాతర ఏర్పాట్లపై శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం సమావేశ మందిరంలో అధికారులు, ఉత్సవ కమిటి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్య కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు రోజులు తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని ట్రాన్స్‌ కో అధికారులను ఆదేశించారు. నిరంతరం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని హుకుంపేట వైద్యాధికారికి చెప్పారు.మెరుగైన పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని పంచాయితీ అధికారులకు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మత్స్య గుండం సమీపంలో గజ ఈత గాళ్లను నియమించాలని మత్స్యశాఖ అధికారులకు చెప్పారు. జిసిసి స్టాల్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా బస్సులు నడపాలన్నారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు మరమ్మతులు చేపట్టాలన్నారు. అధికారులందరూ ముందుగా మత్స్యగుండం సందర్శించి పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయపు పరిపాలనాధికారి పోల రాజు, హుకుంపేట తాహశీల్దారు కె.జయ ప్రకాష్‌, గిరిజన సంక్షేమ శాఖ డి.ఇ . ధృవ, పంచాయితీ రాజ్‌ ఎ ఇ సంజీవరావు, ఉత్సవ కమిటీ చైర్‌ పర్శన్‌ , సర్పంచ్‌ ఎస్‌. శాంతకుమారి, అధ్యక్షులు మినుముల గోపాల పాత్రుడు, ప్రధాన కార్యాదర్శి. పాంగి కొండబాబు, కోశాధికారి చెట్టి హరినాధ్‌ ఆలయ కమిటీ సభ్యులు తమర్బ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.మెడికల్‌ కళాశాలలో పారదర్శకంగా పోస్టుల భర్తీ-వదంతులు నమ్మి మోసపోవద్దు-కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ప్రజాశక్తి-పాడేరు: పాడేరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 34 కేటగిరీలలో ఖాళీగా ఉన్న 244 పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేస్తామని జిల్లా కలెక్టర్‌ ఎఎస్‌ దినేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. పోస్టులు అమ్ముకుంటున్నారన్న వదంతులు తన దృష్టికి వచ్చిందని, అటువంటి వదంతులు ఎవ్వరూ నమ్మవద్దన్నారు. ఎవరూ ఎవరికీ డబ్బులు ఇచ్చి మోస పోవద్దని సూచించారు. ప్రభుత్వ నిభంధనల ప్రకారం నోటిఫై చేసిన పోస్టులను రోస్టర్‌ అనుసరించి మాత్రమె ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుందన్నారు. నియామకం, దృవపత్రాల పరిశీలనకు ఒక నోడల్‌ అధికారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్ధుల మార్క్స్‌ లిస్టులు, అనుభవం తదితర అంశాల ఆధారంగా మెరిట్‌ లిస్టు ప్రకటించడం జరుగుతుందని, మెరిట్‌ లిస్టు ప్రకారమే తుది జాబితా ప్రకటించి భర్తీ చెయడం జరుగుతుందని కలెక్టర్‌ వివరించారు. వదంతులను, రూమర్లను నమ్మవద్దని, ఎవరైనా డబ్బులు అడిగినట్లు తెలిస్తే కళాశాల ప్రిన్సిపాల్‌ కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️