ప్రజాశక్తి-ముంచింగిపుట్టు : మండలంలోని పెదగూడ పంచాయతీ పరిధి పనస గ్రామంలో సుమారు పదేళ్లుగా విద్యార్థులు రేకుల షెడ్డులోనే విద్యా బోధన సాగిస్తున్నారు. ఈ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. 2024 ఏడాది బడి ఈడు పిల్లలు 13 మంది చదువుతున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు చేయి చేయి కలుపుకొని చందాలు వేసుకుని రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టారు. రేకుల షెడ్డులో సుమారు పదేళ్లుగా విద్యా బోధన అందిస్తున్న నేటికీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదని గ్రామస్తులు చెట్టి గణపతి, పూజారి సోమేశ్వరరావు, చెట్టి కేశవరావు, పూజారి హరికృష్ణ, పూజారి శ్రీను, పూజారి గోవిందు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువుల పాకను తలపిస్తున్న రేకుల షెడ్డులో తమ చిన్నారులకు విద్యాభ్యాసం సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులకు పట్టడ లేదన్నారు. అధిక వర్షాలు కురిసినప్పుడు బల్లులు, తేల్లు, సర్పాలు రేకుల షెడ్డులోకి ప్రవేశిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రేకుల షెడ్డులో విద్యాబోధన కష్టాతరంగా మారిందని ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు, ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పూజారి ఎలిసా, పూజారి గోపాల్ , పూజారి నీలమ్మ, పూజారి అనిల్ అనిల్, చెట్టి రాజేశ్వరి ప్రభుత్వాన్ని కోరారు.
