ప్రజాశక్తి- అరకులోయ: ఆంధ్రా ఊటీలో గిరిజన సంస్కృతితో సుస్థిరమైన పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. అందాల అరకులోయ పూల బొకేలను రాష్ట్రానికి తొలి పరిచయం చేస్తామని చెప్పారు. చలి అరకు ఉత్సవం రెండవ రోజున స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శనివారం ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పార్కుకు విళుదగల్ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అరకు ప్రాంతంలో పూల పెంపకానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. బొకెల తయారీలో నైపుణ్యం ఉన్నవారిని తీసుకురావడం జరిగిందని అన్నారు. వారితో గిరిజనులకు తగిన శిక్షణ అందిస్తామని చెప్పారు.బొర్రా కేవ్ నుండి డిగ్రీ కళాశాల మైదానం చలి ఉత్సవ్ వేదిక వరకు సైక్లింగ్ పోటీని ప్రారంభించామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా సైకిల్ రైడ్ నిర్వహించామని పేర్కొన్నారు. అరకు యువకుడు ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు.అరకు బ్రాండ్ సైకిలిస్ట్ గా తయారై రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని ఆయన ఏజెన్సీ కి మంచి పేరుతెస్తాడన్నారు. 2వ తేదీన సుంకర మెట్ట నుండి గాలికొండ వ్యూ పాయింట్ వరకు ట్రెక్కింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఫ్యాషన్ షో నిర్వహిస్తామని చెప్పారు. మూడవ రోజు వివిధ కార్యక్రమాలు, ఫోక్ సింగర్ మంగ్లీ పాటలు పాడతారని తెలిపారు. సైకిల్ రైడ్ విజేతలకు బహుమతులు అందజేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ. పి. అగర్వాల్ మొదటి స్థానం, అరకు లోయ మండలం దండబాడు గ్రామానికి చెందిన పాంగీ అజరు ద్వితీయ, విశాఖ కు చెందిన ప్రియదర్శిని తృతీయ స్థానంలో నిలిచారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఉత్సవ్ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు వేసిన వివిధ సంస్కతిక కళా ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సబ్ డీ.ఎఫ్‌ఓ ఉమా మహేశ్వరి, ఎం.పి.డి.ఓ లవరాజు, డిఎల్ పివో పి.ఎస్.కుమార్, పి.ఆర్. డి.ఈ రామం తదితరులు పాల్గొన్నారు.
