నాటు సారా నిర్మూలనే లక్ష్యం

Mar 20,2025 23:48
వాహనాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ప్రజాశక్తి -పాడేరు: నాటు సారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ ఎ. ఎస్‌. దినేష్‌ కుమార్‌ స్పష్టం చేసారు. గురువారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరం నుండి నాటు సారా నివారణపై రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్రమ నాటు సారా తయారీ దారులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని సూచించారు. నాటు సారా నివారణకు గ్రామస్తులు, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని తెలియజేసారు. గ్రామ మండల స్థాయి, డివిజన్‌ స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమిస్తామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో నాటు సారా నిర్మూలన చర్యలు చేపట్టాలన్నారు. సారా తయారీని విడిచి పెట్టిన తయారీ దారులకు ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. బెల్లం సరఫరా దారులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. సారా తాయారు చేసే గ్రామాలను ఎ. కేటగిరీగాను, తయారీ, పంపిణీ చేసే గ్రామాలను బి కేటగిరీ గ్రామాలుగాను, సారా వినియోగించే గ్రామాలను సి కేటగిరీగాను విభజించాలన్నారు. అటువంటి గ్రామాలపై దాడులు చేసి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నాటు సారా వినియోగంపై కలిగే నష్టాలను చెడు ప్రభావాన్ని వివరించాలన్నారు. సారా తయారీపై 14405 టోల్‌ ప్రీ నంబరుకు సమాచారం అందించాలన్నారు.అనంతరం నవోదయం ప్రచార రథాన్ని ప్రారంభించారు.జిల్లా ఎస్సీ అమిత్‌ బర్దర్‌ మాట్లాడుతూ, సారా నివారణకు పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఇందుకుగాను మహిళా సంఘాల సహకారం తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎన్‌.సుజిత్‌సింగ్‌, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ పి.నాగ రాహుల్‌, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎల్‌.రజని. పాడేరు ఐటిడిఏ ఇన్చార్జి పిఓ, అభిషేక్‌ గౌడ, చింతూరు పి.ఓ అపూర్వ భరత్‌, రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ కల్పశ్రీ, పాడేరు సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, జిల్లా పంచాయతీ అధికారి బి. లవరాజు, గ్రామ వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి పి.ఎస్‌. కుమార్‌ పాల్గొన్నారు.

➡️