ప్రజాశక్తి-పాడేరు:పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కొత్త జీవో ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 26వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై బుధవారం స్థానిక ప్రభుత్వ జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ విశ్వామిత్రకు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాడేరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, అరకు, చింతపల్లి, ముంచంగిపుట్టు ఏరియా ఆసుపత్రిలో గత 20 సంవత్సరాల పైబడి పని చేస్తున్న పారిశుధ్య్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 2019సంవత్సరంలో 16 వేల జీతాలు చెల్లిస్తామని జీవో జారీ చేసినప్పటికీ పారిశుద్ధ్య కార్మికులకు గరిష్టంగా 11,200 మాత్రమే వేతనాలు మాత్రమే అందుతున్నాయన్నారు.నెలలు తరబడి జీతాలు అందక, పీఎఫ్, ఈఎస్‌ఐలు కార్మికుల నుండి వసూలు చేసినప్పటికీ కాంట్రాక్టర్ పీఎఫ్, ఈఎస్‌ఐ సొమ్ము సక్రమంగా జమ చేయలేదన్నారు. కాంట్రాక్టు విధానం రద్దు చేసి డెరెక్టర్ అఫ్ మెడికల్ ద్వారా జీతాలు చెల్లించాలన్నారు. పాడేరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 420 పడకలకు 60 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండవలసి ఉన్నా కేవలం 47మంది తోనే పని చేయిస్తున్నారన్నారు. కొత్త ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. పాడేరు గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో 420, అరకు ముంచంగిపుట్టు, చింతపల్లి ఆసుపత్రి లో పడకల కు సరిపడ్డ సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు. ప్రతి నెలా మొదటి వారంలో జీతాలు చెల్లించాలని, యూనిఫామ్ సక్రమంగా పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు .ముత్యాలమ్మ, ఘాటీ, రాజేశ్వరి, సింహాచలం, నగేష్, చిట్టిబాబు పాల్గొన్నారు….
