మోదకొండమ్మ జాతరను జయప్రదం చేయాలి

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయసునీత

ప్రజాశక్తి -పాడేరు : ఈనెల 9,10, 11 తేదీలలో నిర్వహించనున్న గిరిజన ఆరాధ్య దైవం మోదకొండమ్మ జాతరను విజవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత ఆదేశించారు. అమ్మవారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసారు. కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అమ్మవారి ఘటాలు శతకంపట్టుకు తరలింపు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ, పారిశుధ్ధ్యం, తాగునీటి సదుపాయాలు, రవాణా, విద్యుతు సదుపాయాలు, భోజన వసతి, వైద్య సేవలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. తాగునీటి సమస్య లేకుండా మంచి నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు సూచించారు. క్లోరినేషన్‌ చేసిన మంచినీటిని సరఫరా చేయాలని చెప్పారు. జాతర సంద్భంగా అదనపు సిబ్బందిని నియమించి మెరుగైన పారిశుధ్ధ్య పనులు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. తగినన్ని బస్సులను నడపాలని ఆర్టీసి అధికారులకు చెప్పారు. జాతర సమయంలో భారీ వాహనాల రాకపోకలను ఘాట్‌ రోడ్‌ లో నిషేదించామని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేసారు. నాలుగైదు రోజులు భారీ వాహనాలను అనుమతించ వద్దని పోలీసు, రహదారులు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రైవేటు వాహనాలు పరిమితికి మించి రవాణా చేయకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా మాట్లాడుతూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 750 మంది పోలీసులతో బంధోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆలయం వద్ద, శతకం పట్టు, సినిమాహాలు సెంటర్లలో పబ్లిక్‌ అడ్రెస్‌ సిస్టం ఏర్పాటు చేయాలని సూచించారు. కంట్రోల్‌ రూమ్‌, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.అదనపు ఎస్పీ ధీరజ్‌ మాట్లాడుతూ, ఉత్సవాలకు వచ్చే భక్తుల వాహనాలకు మూడు ప్రదేశాలలో పార్కింగ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విశాపట్నం నుండి పచ్చే వాహనాలకు స్థానిక ఎంపిడిఓ కార్యాలయం సమీపం, చింతపల్లి, జి.మాడుగుల మార్గంలో వచ్చే వాహనాలకు స్థానిక సెయింట్‌ ఎన్స్‌ స్కూలు, అరకు వ్యాలీ, పెదబయలు మార్గంలో వచ్చే వాహనాలకు తలారిసింగిలోని పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేసామన్నారు.ఈ సమావేశంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌, సబ్‌ కలెక్టర్‌ ధాత్రి రెడ్డి, డి. ఆర్‌.ఓ పద్మావతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమాల్‌ భాషా, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ విశ్వామిత్ర, గిరిజన సంక్షేమ శాఖ ఇఇ డి.వి.ఆర్‌.ఎం. రాజు, డి.డి.ఐ. కొండలరావు, జిల్లా పంచాయితీ అధికారి కొండలరావు, డివిజనల్‌ పంచాయతీ అధికారి పి. ఎస్‌.కుమార్‌, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇఇ లీలా కుమార్‌, రహదారులు భవనాల శాఖ ఇఇ బాల సుందర బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్ష కె.రామారావు, సెక్రటరీలు టి.ప్రసాద నాయుడు, శ్రీను, రమణ పాల్గొన్నారు.

➡️