అల్లూరి జిల్లా సమస్యలను పరిష్కరించాలి

మాట్లాడుతున్న సిపిఎం జెడ్‌పిటిసి గంగరాజు

అల్లూరి జిల్లాలో గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థుల మరణాలను అరికట్టాలని సిపిఎం అనంతగిరి జెడ్‌పిటిసి దీసరి గంగరాజు కోరారు. జెడ్‌పి స్థాయీ సంఘ సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ఛైర్‌పర్సన్‌కు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతగిరి మండలం డముకు నుంచి వాలాసి వరకు రోడ్డు అధ్వానంగా తయారైందన్నారు. రోడ్డుకు ఇరువైపులా తుప్పలు పెరిగిపోవడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ రోడ్డును పంచాయతీరాజ్‌ విభాగం పర్యవేక్షిస్తోందని, ఆర్‌అండ్‌బికి అప్పజెప్పాలని డిమాండ్‌ చేశారు. వాలాసి నుంచి వేంగడ మీదుగా పట్టం వరకు, పట్టం నుంచి ఉప్ప వరకు, అలాగే ఉప్ప జంక్షన్‌ నుంచి పెద్దకోట, పినకోట పంచాయతీల మీదుగా జీనబాడు వరకు తుప్పలు తొలగించి, రోడ్డు గుంతలు పూడ్చాలని కోరారు. ఏజెన్సీలో సదరం క్యాంపులు నిర్వహించేటప్పుడు ఏ సెంటర్‌లో నిర్వహిస్తున్నారో అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. పిహెచ్‌సి కేంద్రాలకు బర్త్‌ వెయిటింగ్‌ కోసం వచ్చిన వారికి, రోగులకు భోజన సదుపాయం కల్పించాలన్నారు. ఆసుపత్రి కమిటీ సమావేశాల్లో జెడ్‌పిటిసి సభ్యులకు ప్రాధాన్యత ఇచ్చి సమావేశాలకు పిలవాలన్నారు. మెయింటినెన్స్‌ నిధులు దుర్వినియోగం కాకుండా కమిటీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీలో ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయని ఫిర్యాదు చేశారు. సాయంత్రం సమయంలో స్టడీ అవర్స్‌ జరగటం లేదన్నారు. హెల్త్‌ ఎఎన్‌ఎమ్‌, హెల్త్‌ వర్కర్స్‌ నియామకాలకు తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల మరణాలను అరికట్టాలన్నారు. ఏజెన్సీ మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మృతదేహాల తరలింపునకు డోలీ మోతలే దిక్కవుతున్నాయని, ఇప్పటికైనా రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అరకొరగా ఉన్న ఫార్మేషన్‌ రోడ్లును గుత్తేదారులు పూర్తి చేయాలని, అందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు జిల్లా పరిషత్‌ సమావేశాలకు ఎగనామం పెట్టి తప్పించుకుంటున్నారని, సమావేశానికిరాని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️