అంబేద్కర్‌ స్ఫూర్తితో.. రాజ్యాంగ రక్షణకు పోరాటం

Apr 13,2025 23:38
అంబేద్కర్‌ చిత్ర పటానికి నివాళి అర్పిస్తున్న నాయకులు, గిరిజనులు

ప్రజాశక్తి-అరకులోయ:అంబేద్కర్‌ స్పూర్తితో రాజ్యాంగం రక్షణ, ఆదివాసీ హక్కులు, చట్టాల అమలుకై పోరాటం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ 134 వ జయంతి పురస్కరించుకుని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బస్కి పంచాయతీ గుగ్గడు గ్రామంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొద్దు బాలదేవ్‌, మండల నాయకులు బస్కీ మాజీ ఎంపీటీసీ బురిడి దశరథ్‌ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు ఉండాలని దేశంలో సమగ్ర అబివృద్ధి జరగాలని అంబేద్కర్‌ ఆకాంక్షించారన్నారు..కేంద్రంలో బీజేపీ సర్కారు ప్రధానంగా ఆదివాసులకు అడవి నుండి గెంటివేస్తూ నూతన అటవీ సవరణ బిల్లును ఆమోదించిందన్నారు. అడవి మీద ఆదివాసులకు హక్కులు లేకుండా చేస్తున్నరని రాష్ట్ర ప్రభుత్వం వేలమంది ఆదివాసుల వందల ఎకరాలు జల సమాధి చేసేందుకు కార్పొరేట్‌ కంపెనీలకు సుమారు 8 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కోసం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు కోసం అనుమతులు మంజూరు చేసిందని టూరిజం అభివద్ధి పేరుతో 1/70 చట్టం సవరణ చేస్తామని,పెసా చట్టం,అటవీ హక్కుల చట్టం ఉల్లంఘిస్తూ ఖనిజా సంపద,సహజ వనరులు అదానీ అంబానీలకు ధారాదత్తం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివాసులకు జీఓ నెంబర్‌-3 నూరు శాతం రిజర్వేషన్‌ చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 కేబినెట్‌ సమావేశాలు నిర్వహించారని కనీసం ఆ దిశగా చర్చించలేదని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నూరు శాతం రిజర్వేషన్‌ చట్టబద్ధత కల్పించాలని ఆదివాసీలకు స్పెషల్‌ డీఎస్సీ నోటిపికేషన్‌ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని ఆదివాసీ ప్రాంతాల్లో ఫారెస్టు అనుమతుల పేరుతో వందల రోడ్లు ఆపేశారని ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆగిన రోడ్లు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బురిడీ కొండ, పూజారి సద్దు, కిల్లో సోనబాబు,గొల్లూరి బస్వా గ్రామ యువకులు మోస్య నాగేశ్వరావు, పూజారి దూత్‌, బలరాం, మాజీ వార్డుసభ్యులు అచ్చమ్మ,మోత్తి,రోహిల, కలిమా, రంభ, ఇరమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️