2 వేల మెట్రిక్‌ టన్నుల కాఫీ కొనుగోలు లక్ష్యం

Nov 27,2024 00:39
మాట్లాడుతున్న జిసిసి ఛైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌

ప్రజాశక్తి -అరకులోయ :ఈ ఏడాది 2వేల మెట్రిక్‌ టన్నుల కాఫీని కొనుగోలుకు లక్ష్యం పెట్టుకోవాలని రాష్ట్ర జిసిసి చైర్మన్‌ కిడారి శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు. జిసిసి చైర్మన్‌ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా అరకులోయలోని పర్యాటక శాఖ పున్నమి అతిథి గృహంలోని గోష్టి హాలులో చింతపల్లి, పాడేరు డివిజన్‌ పరిధిలోని జిసిసి డీఎం, బ్రాంచి మేనేజర్లు,సేల్స్‌ మేన్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించి గిరిజన సహకార సంస్థ (జిసిసి) పై సమీక్షించారు. గతంలో జిసిసి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.గత ప్రభుత్వం గిరిజన సహకార సంస్థను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని, తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఈ సంస్థను నిలబెట్టి పరుగులు తీయించాలని సూచించారు. గిరిజన సహకార సంస్థను ప్రక్షాళన చేసి రూపు రేఖలు మార్చడమే తన లక్ష్యమని ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.15 వందల నుంచి 2వేల మెట్రిక్‌ టన్నుల వరకు కాపీని సేకరించాలని ఆయన ఆదేశించారు. కాపీ పంటపై ప్రత్యేక దృష్టి సారించి అధికారులతో సమావేశాలు నిర్వహించి పర్యవేక్షిస్తానని ఆయన అన్నారు. కాఫీ తో పాటు ఇతర అటవీ ఉత్పత్తుల కొనుగోలుపై దృష్టి సారించాలన్నారు.బెంగళూరు వంటి ప్రాంతంలో కాఫీ పంట ఉన్నప్పటికీ, ఏజెన్సీ ప్రాంతంలో అడవులపై ఆర్గానిక్‌ కాపీ పండించడంతో ఇక్కడ కాపీకి మంచి గిరాకీ ఉందన్నారు. అందుకే ప్రపంచ దేశాలు అరకు కాపీ కొనుగోలుకు పోటీ పడుతున్నాయని ఆయన అన్నారు. జిసిసి సంస్థలోని సిబ్బంది కాఫీ కొనుగోలుకు ఫీల్డ్‌కు వెళ్లడానికి అలవెన్స్‌ చెల్లించే విషయంపై ఆలోచిస్తామన్నారు. మండల కేంద్రాల్లో జిసిసి గోడౌన్‌లను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో కాఫీ జనరల్‌ మేనేజర్‌ ఉమాదేవి, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరావు, పాడేరు జిసిసి డిఎం డి.సింహాచలం, చింతపల్లి డిఎం దేవరాజు వివిధ మండలాల జిసిసి మేనేజర్లు, సేల్స్‌ మెన్లు సిబ్బంది పాల్గొన్నారు.

➡️