xప్రజాశక్తి-చింతపల్లి: తాము ప్రయాణం చేసేది సాహసోపేతమైన ప్రయాణమైనా తప్పని పరిస్థితుల్లో గిరిజనులు జీపులను ఆశ్రయిస్తున్నారు. చింతపల్లి, జి.మాడుగుల మండలాలకు చెందిన తమ్మెంగుల, కుడుముసారి, లువ్వాసింగి పంచాయతీల సరిహద్దు గ్రామాల ప్రజలు అన్నవరం వారపు సంతకు, లోతుగడ్డ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలంటే ప్రాణాలను తెగించి ప్రయాణం చేయాల్సిందే. సోమవారం అన్నవరం గ్రామంలో జరిగిన వారపు సంతకు భీమనపల్లి, బొడ్డపుట్టు, కిలుములు, వంచెబు దుర్గం, సంపంగిపుట్టు, సంకులమిద్దే, అలగం, కిలిమిసింగి తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు ప్రైవేటు వాహనంలో సాహసోపేత ప్రయాణం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు కానీ తమ ప్రాంతాలకు రహదారి, వంతెన నిర్మాణాలు చేపట్టడం లేదని ఆ ప్రాంత ప్రజలు తెలిపారు. పాలకుల తమను ఓటర్లుగానే తప్పా ఏనాడూ మనుష్యులుగా చూడలేదని ఆ ప్రాంత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ గ్రామాలకు తారు రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని ఆ ప్రాంత ప్రజల వాపోతున్నారు.
