ప్రజాశక్తి – ఆలమూరు : యజమానులు పని ప్రదేశాల్లో కార్మిక చట్టాలు పక్కాగా అమలయ్యేలా చూడాలని మండపేట సహాయ కార్మిక అధికారి కాశీ శివ నాగమల్లేశ్వరరావు పేర్కొన్నారు. కార్మిక శాఖ ఆన్లైన్ తనిఖీ విధానంలో భాగంగా మంగళవారం ఆయన మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఇటుక బట్టీల్లో తనిఖీలు నిర్వహించారు. ఇటుక బట్టి యజమానులు నిర్వహించాల్సిన రిజిస్టర్లు సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో పరిశీలించారు. అనంతరం రిజిస్టర్ల నిర్వహణలో ఉన్న లోపాలను సరి చేసుకోవాలని వారికి ఆదేశించారు. కార్మిక సంక్షేమ నిధికి తమ వద్ద పని చేస్తున్న కార్మికునికి రూ.100 చొప్పున బ్యాంకులో కానీ, ఆన్లైన్ విధానంలో కానీ చెల్లించాలని, ఫారం ఎఫ్ పూర్తి చేసి నగదు కట్టిన చలానా జతపరిచి ఆ వివరాలను కార్మిక శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. కార్మికులకు ఈ శ్రమ కార్డులను, పింఛను స్కీమును అమలు చేయాలని యజమానులకు తెలిపారు. కనీస వేతన చట్ట ప్రకారం జీతాలు చెల్లించి రిజిస్టర్లు రాయాలని సూచించారు. కార్మికులకు ఉద్యోగ నియామక ధ్రువపత్రాలు ఇచ్చి వాటి నకళ్ళను ఆఫీసులో ఇవ్వాలన్నారు. తనిఖీ చేసిన ఇటుక బట్టిల్లో బాల కార్మికులు ఎవరూ లేరని, ఎవరైనా బాలలను పనిలో చేర్చుకోవాలని కోరినా అంగీకరించకుండా బాల కార్మిక నిషేధ చట్టం అమలు చేయాలని తెలిపారు.