పంటలు అమ్మటానికి వీధుల వెంట..

Apr 15,2025 23:57

మాచర్లలో చిలకడదంపలు అమ్ముకుంటున్న ప్రకాశం జిల్లా రైతు
ప్రజాశక్తి – మాచర్ల :
ఒకప్పుడు పొలం వద్దే పంటను అమ్ముకున్న రైతులు ఇప్పుడు ఊళ్లు పట్టుకు తిరుగుతున్నారు. అప్పట్లో ఒకటి రెండు పంటలకు పరిమితమైన వీధి విక్రయాలు క్రమంగా ఇతర పంటలకూ విస్తరించాయి. గతంలోనూ కొంతమంది రైతులు ఇతర గ్రామాలకు వెళ్లి గెనిసగెడ్డలు, వేరుశనగ, టమోటా ఇతర పంట ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే పద్ధతి ఉన్నా ఈ కాలంలో మరింతగా పెరిగింది. బత్తాయిలు, జామకాయలు, పుచ్చకాయలు, డ్రాగన్‌ ఫ్రూట్‌, మొక్కజొన్నలను ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో తెచ్చి అమ్ముకుంటున్నారు. ఇన్ని తిప్పలూ ఎందుకంటే వ్యాపారులకు అమ్ముకుంటే నష్టాలు వస్తాయనే భయంతోనని చెబుతున్నారు.
పంటను మార్కెట్లో అమ్ముకుని డబ్బుతో ఇంటికెళ్లాల్సిన రైతు వీధి వీధికీ వెళ్లి తన పంటను వీధి విక్రేతలాగా అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. బహిరంగ మార్కెట్లో ధరల్లేకపోవటంతో జిల్లాలు దాటి ఊరూరా తిరగాల్సిన దైన్యం నెలకొంది. మాచర్ల పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముతున్న వారిని విలేకర్లు ప్రశ్నించగా తాము రైతులమని చెబుతూ తమ గోడును వెల్లబోసుకున్నారు.
ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని బల్లెకురవ మండలం వల్లాపల్లి గ్రామానికి చెందిన చిన్నకారురైతు సోరల యోహాన్‌ తాను పండించిన చిలకడదుంప (గెనిసగెడ్డలు)లకు మద్దతు ధర లభించకపోవటంతో ఎద్దుల బండిపై మాచర్ల చుట్టు పక్కల గ్రామాల్లో తిరిగి అమ్ముకుంటున్నాడు. యోహాన్‌ మాట్లాడుతూ తాను పండించిన చిలకడదుంపలతో బాటు ఇతర రైతుల వద్ద కొంత సరుకును కొనుగోలుచేసి, తనతోపాటు ఎనిమిది మంది రైతులను కలుపుకొని ఈ ప్రాంతానికి వచ్చి, ఊరూర తిరుగుతూ అమ్ముకుంటున్నట్లు తెలిపారు. సరుకు మొత్తం ఒకేసారి తెచ్చుకొని ఈ ప్రాంతంలో నిలువ చేసుకొనేందుకు వెసులుబాటు లేకపోవటంతో సరుకు అయిపోయినప్పుడుల్లా తమ ప్రాంతం నుండి మినీ లారీ ద్వారా తెప్పించుకుంటున్నట్లు తెలిపారు. ఇలా రెండు, మూడు నెలల పాటు అమ్ముకుంటుఆమని చెప్పారు. సరుకు నిల్వచేసుకోవటానికి, అమ్ముకోవటానికి రైతుబజార్లుంటే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాడు. తాము ఎద్దుల బండితో ప్రధాన రహదారి పక్కన వున్న గ్రామాలు, పట్టణాలతో తిరుగుతూ అమ్ముకుంటామని, అన్నా క్యాంటీన్లులో ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు తింటున్నామన్నారు. రాత్రులు బండిపైన నిద్రపోతామని చెప్పారు. అయితే ఈ వేసవిలో ఎద్దులకు నీటికి ఇబ్బందిగా ఉన్నదని చెప్పారు. కష్టమైనా రూపాయి మిగలాలంటే ఇలా తిరిగి అమ్ముకోవాల్సిందేనని వాపోయాడు.
తెలంగాణ రాష్ట్రం, పెదఊర మండలం, కుంకుడుచెట్టు తండాకు చెందిన గిరిజనరైతు రమావత్‌ చందూనాయక్‌ తన పొలంలో పండిన వచ్చి వేరుశనగను ద్విచక్ర వాహనంపై మాచర్ల ప్రాంతంలో తిరుగుతూ అమ్ముకుంటున్నాడు. చందూనాయక్‌ మాట్లాడుతూ సరైన ధర లేకపోవటంతో స్వయంగా అమ్ముకుంనేందుకు మూడు, నాలుగు బస్తాల సరుకును ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి ఈ ప్రాంతంలో తిరిగి అమ్ముకొని రాత్రికి ఇంటికి చేరతానని తెలిపారు. ఖర్చులన్నీ పోను రోజుకు రూ.వెయ్యి మిగులుతున్నాయని చెప్పాడు. తన పొలంలో పండిన పంటతో పాటు, మరికొంత మారు బేరానికి కూడా తీసుకుంటున్నట్లు చెప్పాడు. మాచర్ల మండలంలోని గిరిజన ప్రాంతాల్లో పండే పుచ్చకాయలను రైతులే ట్రాక్టర్లు, ఆటోలపై పట్టణానికి వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు మండుటెండలో నిలబడి అమ్ముకొని వెళుతున్నారు. బొప్పాయి, బత్తాలు, జామ తోటల రైతులతో పాటు కొందరు కూరగాయాలు పండించే రైతులు కూడా రోడ్ల వెంట తిరిగి అమ్ముకుంటున్నారు. వీరందరి నోట వెంట వినపడేది.. పంటకు సరైన ధర లభించటం లేదని, తాము బజారుకెక్కి అమ్ముకుంటే కొంత ఆదాయం వస్తుందని, దళారులకు అమ్ముకుంటే నష్టం వస్తుందని. పంట కొనుగోలు కోసం పొలం వద్దకు వచ్చిన దళారులు వారికి ఇష్టమొచ్చిన రేటు అడుగుతున్నారని, తమమాదిరి తిరిగి అమ్ముకోలేని వారు వచ్చినకాడికే చాలని దళారులకు అమ్ముకుంటున్నట్లు తెలిపారు. రైతుల ఉత్పత్తులు అమ్ముకునేందుకు పట్టణాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. రైతుకు అన్ని రకాలుగా సహకరించేందుకు ప్రభు త్వం సిద్ధపడితేనే రైతులు వ్యవసాయం చేయగలుగుతారని, లేకుంటే రైతు కనిపించడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️