అంబేద్కర్‌ విదేశీ విద్యాదీవెన పునరుద్ధరణ

Apr 15,2025 00:47

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో అంబేద్కర్‌ విదేశీ విద్యా దీవెన పథకాన్ని త్వరలో పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేద్కర్‌ జయంతి వేడుకలు, పి4 సాధికారిక సభలో ఆయన ప్రసంగించారు. తొలుత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గత పాలకులు కక్షపూరితంగా అమరావతిని నాశనం చేశారని, ప్రజల ఆశీస్సులతో ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతిని తీర్చిదుద్దుతామని అన్నారు. రాజధానిలో రైతులకు, వ్యవసాయ కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. రాష్ట్రంలో సాంఘీక సంక్షేమ శాఖ ద్వారా ఎస్‌సి,ఎస్‌టిల సంక్షేమానికి రూ.20,221 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. ఎస్‌సి, ఎస్‌టిలకు విద్యుత్‌ ఛార్జిల భారం నుంచి బయటపడేశందుకు వీలుగా వారికి సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,241 ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో 2 లక్షల 35 వేల 600 మంది విద్యార్థులున్నారు. వారికి రూ.1,331 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 21 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని, వారి కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. మీ ఇళ్లపై సోలార్‌ ప్యానెల్స్‌ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి 200 యూనిట్లు వాడుకుని మిగిలింది ప్రభుత్వానికి ఇస్తే రూ.యూనిట్‌ కు 2.09 పైసలు ఇస్తాంమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఇల్లు కట్టుకునేందుకు 50 వేలు అదనంగా డబ్బు ఇస్తామన్నారు. పి4పై తెలియని వారు ఎదో మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ధనికులు పేదలను ఆదుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారని దీనికి ఏదోదో మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా ప్రజావేదిక సభలో మార్గదర్శి-బంగారు కుటుంబం కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలకు ఎంపికైన వారి సమస్యలు విన్నారు. కుటుంబాలను దత్తత తీసుకున్న మార్గదర్శులను సన్మానించారు. పొన్నెకల్లులో ప్రజల ఆదాయం పెరిగేందుకు కార్యాచరణ రూపొందిస్తామని, ఈ గ్రామంలో 369 పేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు 11 మంది ముందుకు వచ్చారని చెప్పారు. అంతకుముందు గ్రామంలోని పేదల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. వారితో కలిసి టీ తాగారు. కొంత మంది తక్షణం సాయం అందించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ భార్గవ తేజను ఆదేశించారు. నవీన్‌ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. బైక్‌ మెకానిక్‌ ప్రవీణ్‌ షాపును పరిశీలించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో అభివద్ధి మరమ్మతులకు 31 పనులకు పీఎం ఏజెఏవై, డీఎంఎఫ్‌ నిధులు రూ.102.27 కోట్ల అంచనాలతో శంకుస్థాపన శిలాఫలకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అంబేద్కర్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాల చిత్రకళా ప్రదర్శనను పరిశీలించి, చిత్రకారుడు కత్తి బాలకోటేశ్వరరావును అభినందించారు. జిల్లాలోని 82 మహిళా స్వయం సహాయక సంఘాలకు ఎస్సీ కార్పోరేషన్‌ ఉన్నతి పథకం ద్వారా అందించిన ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసుకున్న స్వయం ఉపాధి వ్యాపారాల ఫొటో ప్రదర్శనను పరిశీలించారు. తెనాలి బుర్రిపాలెంకు చెందిన పునుగుపాటి హెవీలా ఎస్సీ కార్పోరేషన్‌ రుణ సహాయం ద్వారా కోనుగోలు చేసిన ఫోటో స్టూడియో పరికరాలను పరిశీలించారు. ఒక్కొరికి 50 కుటుంబాల నుంచి 100 కుటుంబాల వరకు దత్తత తీసుకోవాలని కోరారు. తాడికొండ, పొన్నెకల్లు గ్రామాల్లో నెలకొన్న నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక నిధుల ద్వారా ఈ రెండు పథకాలు పూర్తి చేస్తామన్నారు. సభలో ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ తాడికొండలో తాగునీటి ఎద్దడి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని, కొండ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి ఘాట్‌ రోడ్డు నిర్మించాలని, తాడికొండలో రహదారులు విస్తర్ణం వలన నష్టపోయిన భవన యజమానులకు టీడీఆర్‌ బాండ్లు ఇవ్వాలని, లాం వద్ద కొండవీటి వాగుపై గత ప్రభుత్వం రద్దు చేసిన బ్రిడ్జి నిర్మాణాన్ని తిరిగి మంజూరు చేయాలని, తాడికొండ నియోజకవర్గంలోని ప్రదాన గ్రామాలను కలుపుతూ రహదారిని నిర్మించాలని, ఫిరంగపురంలో కొండపై ఉన్న చర్చిని కొండవీటీ టూరిజం ప్యాకేజీలో అభివద్ధి చేయాలని, బండారు పల్లి మేజరు కెనాల్‌ లో పూడిక తీయాలని కోరారు. పొన్నెకల్లు గ్రామ ఎకనామిక్స్‌ రిపోర్టును రాబోవు సంవత్సరాలలో లక్ష్యాలను నిర్దేశుంచుకున్న వివరాలను పంచాయితీ కార్యదర్శి షేక్‌ మహమ్మద్‌ వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ సెక్రటరీ ఎంఎం నాయక్‌, జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ హెనీ క్రిస్టీనా, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
పేదలతో ముఖాముఖి : బంగారు కుటుంబానికి ఎంపికైన లబ్ధిదారులు సరిగల నీలిమ
నా భర్త చనిపోవడంతో ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంటున్నాను. సొంత ఇల్లు లేదు, స్థలం లేదు. మా నాన్న విద్యుత్‌ పని చేస్తూ మమ్మల్ని పోషిస్తున్నారు. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. నెలకు రూ.8 వేలకు కిరాణా షాపులో పని చేస్తున్నాను. పదవ తరగతి వరకు చదువుకున్నానని తెలిపారు. సిఎం జోక్యం చేసుకుంటూ ఈ కుటుంబానికి అండగా ఉండాలని మార్గదర్శుకులుగా ఎంపిక అయిన డి.సూర్య ప్రకాశరావుకు సూచించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందించి నీలిమ కుమారుడు చెవిని బాగు చేయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం లేదు : గొడవర్తి స్వప్న
నాకు ఇద్దరు పిల్లలున్నారు. నాకు మా మామయ్య కట్టించిన ఇంట్లోనే నాలుగు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నేను డిగ్రీ వరకూ చదువుకున్నాను. మాకు ఆస్తులు, పొలాలేమీ లేవు. నాకు ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా భర్త సెంట్రింగ్‌ వర్క్‌ చేస్తున్నారు. నెలలో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటోంది. నా భర్తకు సెంట్రింగ్‌ సామగ్రిని సమకూర్చాలని కోరారు. పై డేటా సెంటర్‌ అధినేత మార్గదర్శుకులు ముప్పనేని కల్యాణ్‌ మాట్లాడుతూ ఈ కుటుంబంతో గ్రామంలో 100 కుటుంబాలను దత్తత తీసుకుంటానని తెలిపారు.
50 కుటుంబాలకు చేయూతనిస్తాం :
సిఎం చంద్రబాబు స్ఫూర్తితో పొన్నెకల్లులో 50 కుటుంబాలను దత్తత తీసుకుని వారికి చేయూతనిస్తానని శ్రీలతా పరమేశ్వరి స్పిన్నింగ్‌ మిల్‌ అధినేత సూర్యప్రకాశ్‌ రావు తెలిపారు. సరిగల నీలిమకు ఉద్యోగం ఇస్తాం. ట్రైనింగ్‌ ఇచ్చి ఇల్లు, భోజనం వసతి కల్పించి మంచి జీతం ఇస్తాం. ఆమె ఇద్దరి పిల్లల చదవు బాధ్యతను తీసుకుని ప్రయోజకులు అయ్యే దాకా చూసుకుంటాం. పొన్నెకల్లులో 50 పేద కుటుంబాలు పైకి తీసుకొచ్చేలా చొరవ తీసుకుంటామని వివరించారు.
10 కుటుంబాలు దత్తతకు అంగీకారం
గుంటూరులోని కెకె స్పింటెక్ప్‌ అధినేత కె.ప్రసాద్‌ మాట్లాడుతూ సిఎం సూచనలతో గ్రామంలో పి-4 అమలుకు కృషి చేస్తామని 10 కుటుంబాలను దత్తత తీసుకుని వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.అందరికి ఉచిత కంటి ఆపరేషన్లు : ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్మెంట్‌ చేసేందుకు మేం ముందుకు వస్తామని, మా డాక్టర్స్‌ అందరం గుంటూరు బ్రాంచ్‌ తరపున 50 కుటుంబాలను దత్తత తీసుకుంటామని అందరికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు.
విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడిన చంద్రబాబు
టిడిపి హయాంలో ప్రవేశపెట్టిన అంబేద్కర్‌ విదేశీ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించి నేడు మంచి ఉద్యోగం చేస్తున్న వారితో ప్రజావేదిక నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా మాట్లాడారు.

➡️