నరసరావుపేటలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న బాబూరావు, కృష్ణయ్య తదితరులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా, గుంటూరు : ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు దూసుకెళ్తుంటే ఇండియా మాత్రం మాత్రం కుల, మత వివక్షలో కూరుకుపోతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు అన్నారు. కుల వివక్షను అంతం చేయకుండా దేశ పురోగతి సాధ్యం కాదన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం పల్నాడు విజ్ఞాన కేంద్రంలో చిత్రపటానికి బాబూరావుతోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్ పూలమాలలేసి నివాళులర్పించారు. బాబూరావు మాట్లాడుతూ ఒకవైపు సామాజిక వివక్ష, మరోవైపు మైనారిటీలపై మత వివక్ష కొనసాగుతున్నాయని, ఇవి రాజ్యాంగ విరుద్ధ అంశాలని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి మూలమైన అంశాలకు, విలువలకు, సామాజిక న్యాయానికి, ప్రజాస్వామ్యానికి మోడీ తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతిపక్షాలు విధానపరమైన అంశాలపై కాకుండా, కుల, మత అంశాల ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. నరసరావుపేట పట్టణం గడియార స్తంభం సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి విజరుకుమార్, పూలమాలలేసి నివాళులర్పించారు. సిఐటియు నాయకులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.భారత రాజ్యాంగ పరిరక్షణే డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజి అన్నారు. గుంటూరు నగరం లాడ్జిసెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం నాయకులు పూలమాలలేయగా నేతాజి మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి, వర్థంతికి ఆయన విగ్రహాలకు పూలదండలు వేస్తూ కొన్ని రాజకీయ శక్తులు ఆయన ఆశయాలకు, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు. సామాజిక న్యాయం కోసం ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌కు నివాళి అర్పించటం అంటే సామాజిక న్యాయం పరిరక్షించడం, అత్యున్నత భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుటమేనని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.ఏ.చిష్టి, దండా లక్ష్మీనారాయణ, ఎల్.అరుణ, బి.లక్ష్మణరావు, బి.ముత్యాలరావు, నాయకులు బైరగాని శ్రీనివాసరావు, కాకుమాను నాగేశ్వరరావు, మహ్మద్ అబ్దుల్ సలీం, గోనె లూధర్ పాల్, ఆది నికల్సన్ పాల్గొన్నారు.
గుంటూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజి తదితరులు
