ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : భూఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సొరు సాంబయ్య డిమాండ్ చేశారు. వేదాంత డవలపర్స్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మున్సిపాలిటీలోని భైరిసాగరం, కోటిచెరువు, మేధారబంద, రామయ్యచెరువు, పక్షులుబంద, కిచిడిబంద, అలజంగి చుట్టుచెరువు ఆక్రమణకు గురైనప్పటికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. పూల్ బాగ్ లో ప్రభుత్వ భూమి, గొల్లపల్లి, గొర్లెసీతారాంపురం, భూబందరవలస రెవెన్యూలో వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందన్నారు. మల్లమ్మపేట రెవెన్యూలో సర్వే నెంబర్ 115-1, 2,3,4లలో 19.50 ఎకరాల భూమిని భూసీలింగ్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆయా భూమి ఆక్రమణకు గురైందన్నారు. పాతబబ్బిలిలో గ్రామ కంఠం భూమి ఎకరా వరకు ఆక్రమణకు గురైనప్పటికి రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఆక్రమణకు గురైనప్పటికి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికార యంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో పోరాటం చేస్తామన్నారు.
