ప్రజాశక్తి – సాలూరు : జిల్లాకు మంజూరైన ఐదు అంబులెన్స్‌లను రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శనివారం ప్రారంభించారు. అంబులెన్స్‌లతో పాటు గిరిజనులకు దగ్గరలో నిత్యావసర వస్తువులు అందుబాటులో తెచ్చేందుకు ఏర్పాటు చేసిన గిరి బజార్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనులకు ఎటువంటి కష్ట నష్టాలు జరగకుండా అంబులెన్స్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. సంతల్లో వివిధ రకాల కల్తీ బారిన గిరిజనులు పడకుండా నాణ్యమైన సరుకులు లభించేలా గిరి బజార్ ఏర్పాటు చేశామని తెలిపారు. గిరిబజార్లో అన్ని నిత్యవసర సామగ్రి అందుబాటులో ఉంటుందని, సరసమైన ధరలు లభిస్తాయని ఆమె చెప్పారు. సామాజిక కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్‌లను అందించిన సంస్థను ఆమె అభినందించారు. సాలూరు పాటు మిగిలిన ప్రాంతాల్లో అంబులెన్స్‌లు సేవలను అందిస్తాయని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా గిరి బజారులో సామాగ్రిని మంత్రితో పాటు ఐటిడిఎ పిఒ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు కొనుగోలు చేశారు. విద్యార్థులకు పరీక్ష సామగ్రి అందజేతపదో తరగతి పరీక్షలు రాస్తున్న స్థానిక ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థులకు సామాగ్రిని మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా బాగా చదువుకొని పరీక్షలు బాగా రాయాలని ఆకాంక్షించారు. త్వరలో అన్ని బాలికల ఆశ్రమం పాఠశాలలో వేడి నీరు సరఫరా జరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ ఎం.సుధారాణి, ఎపిడి వై.సత్యంనాయుడు, డిఎంహెచ్‌ఒ ఎస్.భాస్కరరావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఆర్.కృష్ణవేణి, జిసిసి డిఎం యు.మహేంద్ర కుమార్, ఐసిడిఎస్ పీడీ డాక్టర్ టి.కనకదుర్గ, తదితరులు పాల్గొన్నారు.ఘనంగా మంత్రి సంధ్యారాణి జన్మదిన వేడుకలు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఆమె నివాసం లో కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే కేక్ కట్ చేశారు. అనంతరం కలెక్టర్ శ్యాం ప్రసాద్‌తో పాటు ఐటిడిఎ పిఒ అశుతోష్ శ్రీ వాత్సవ్, ఇతర జిల్లా అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. క్యాంప్ కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తల సందడి కనిపించింది.
