ప్రజాశక్తి – కడప : కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి తన మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ కడప అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ బండి జకరయ్య డిమాండ్ చేశారు. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద బండి జకరయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి జకరయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో పూజ్యులు, యుగపురుషులు, రాజ్యాంగ శిల్పి అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన సిగ్గుమాలిన వ్యాఖ్యలపై యావత్ భారతదేశం రగిలిపోతుందన్నారు. ఈ తరుణంలో ప్రాంతాలకు అతీతంగా ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్న క్షణంలో కాంగ్రెస్ ప్రజా పక్షాన నిలుస్తూ ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షా క్షమాపణ చెప్పాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుందన్నారు. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని అంబేద్కర్ పాదాల వద్ద వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్, సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షులు మామిళ్ళ నరసింహులు, అబ్దుల్ సత్తార్, మల్లెం విజయభాస్కర్, సంజయ్ కాంత, కుళ్లాయప్ప, సునీల్, శ్యామలమ్మ, నాగరత్నగౌడ్, ఏకాదశి భువన్ రెడ్డి, సిరాజుద్దీన్, హరిప్రసాద్, దస్తగిరి పాల్గొన్నారు.