పుట్టగొడుగుల్లా మందుగుండు షాపులు

Oct 30,2024 21:39

హైవేకి ఇరువైపులా దుకాణాలు ఏర్పాట

 అడ్డుగోలుగా వ్యాపారాలు 

భయాందోళనలో ప్రజలు

గత ఏడాదికంటే 20శాతం పెరిగిన టపాసుల ధరలు

ప్రజాశక్తి-విజయనగరం కోట  : దీపావళి నేపథ్యంలో నగరంలోని కెఎల్‌పురం నుంచి ఆర్‌టిఒ కార్యాలయం వరకు మందుగుండు విక్రయాల షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అగ్నిమాపక శాఖ, పోలీసుశాఖ, రెవెన్యూ అధికారుల అనుమతితో తాత్కాలిక షాపులను పెట్టుకోవాల్సి ఉండగా, అనుమతులు లేకుండా పలు షాపులు ఏర్పాటు కావడంతో ఆశ్చర్యం కలుగుతోంది. కలెక్టరేట్‌ నుంచి గజపతినగరం, బొబ్బిలి, సాలూరు వైపు వెళ్లే జాతీయ రహదారికి ఇరువైపులా, పెట్రోల్‌బంకు సమీపంలో షాపులు ఏర్పాటు కావడం పట్ల ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులంటూ జనం చర్చించుకుంటున్నారు. హైవేకు కనీసం 100 మీటర్ల దూరం కూడా లేకుండా షాపులు నెలకొల్పారు. వాటికి సమీపంలో ఒక పెట్రోల్‌ బంక్‌ కూడా ఉండడం ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఏదైనా జరగరానిది జరిగితే కనీసం మంటలను అదుపు చేయడానికి కూడా వీలు లేనంత దగ్గరగా ఒకేచోట పది నుంచి పదిహేను షాపులు పెట్టారు. మరోవైపు మందుగుండు సామాగ్రి ధరలకు సంబంధించి కచ్చితమైన పట్టికలు లేకపోవడంతో వ్యాపారులు తమకు నచ్చినట్లు విక్రయిస్తున్నారు. పేలిపోతున్న టపాసుల ధరలు టపాసుల ధరలు పోలిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే అన్ని ధరలూ 20 నుంచి 30శాతం వరకూ పెరిగాయి. ఏది కొందామన్నా వంద రూపాయలపైనే ఉంది. వెయ్యి రూపాయలు తీసుకెళ్తే చిన్న క్యారీబ్యాగ్‌తో కూడా టపాసులు రావడం లేదు. అగ్గిపెట్టే నుంచి తౌజండ్‌ వాలా వరకు అన్ని ధరలూ భారీగా పెరిగాయి. ట్రాన్సుపోర్టు, పన్నులు, దుకాణ అద్దెలు, కెమికల్స్‌ ధరల పెరుగుదల టపాసులపై పడిందని, అందుకే ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. జిల్లాలో కోట్లలో వ్యాపారం కెఎల్‌పురం లోగల మందుగుండు షాపుల వద్ద కోట్లాది రూపాయల విక్రయాలు జరుగుతున్నాయి. అటు శ్రీకాకుళం, ఇటు ఒడిశా నుంచి కూడా వ్యాపారులు ఇక్కడ హోల్‌సేల్‌ షాపుల నుంచే బాణాసంచా కొనుగోలు చేస్తుంటారు. జిల్లాలో లైసెన్సు దుకాణాలు అత్యధికంగా విజయనగరంలోనే ఉన్నాయి. ఇవి కాకుండా పండగ మూడురోజులు తాత్కాలిక లైసెన్సు పొంది వందలాది షాపులు వెలుస్తుంటాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో ఈ ఏడాది విక్రయాలు పెరిగాయి.ఏటా పెరుగుతున్న ధరలు జిఎస్‌టి ఇతర కారణాలతో బాణసంచా ధరలు సామాన్యులకు అందుబాటులో లేనంతగా పెరిగిపోతున్నాయి. పిల్లల సరదా కోసం తమ బడ్జెట్‌కు అనుగుణంగా టపాకాయలు కొనుగోలు చేస్తుంటారు. కార పువ్వొత్తులు, చిచ్చుబడ్లు, తారాజువ్వలు, ఇలా అన్నింటి ధరలూ కొండెక్కాయి. గతంలో రూ.15వందలు పెట్టి కొనుగోలు చేస్తే కుటుంబమంతా పండగ చేసుకునేవారు. నేడు రూ.3వేలు వెచ్చించినా సరిపడా మతాబులు రాని పరిస్థితి నెలకొంది. దీపావళి సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలుఅగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్‌ ఫ్రీ నెంబర్లను సంప్రదించండి.బాణాసంచా కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు- బాణాసంచా కాల్చే సమయంలో కాటన్‌ దుస్తులు ధరించండి.- మీ ఇంటి కిటికీలు,తలుపులు మూసివేయండి. పసిపిల్లలు ఉంటే ఇంటి లోపలే ఉంచండి.-పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పిల్లలు బాణాసంచా కాల్చాలి -బాణసంచా కాల్చేటప్పుడు ఒక బకెట్‌ నీరు మరియు ఇసుకను అందుబాటులో ఉంచుకోండి.-బాణాసంచాతో ప్రయోగాలు చేయవద్దు. అవి కాల్చేపుడు మీ ముఖాన్ని దూరంగా ఉంచండి.- కాల్చడంలో విఫలమైన బాణసంచాను మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయవద్దు.-ఫైర్‌ క్రాకర్‌లను వెలిగించి విచక్షణా రహితంగా బహిరంగంగా విసిరేయకండి.-ప్రమాదకర టపాసులు వంటి బాణాసంచా కాల్చే సమయంలో చేతితో పట్టుకోవద్దు.

➡️