విద్యార్థులు, యువతను దగా చేసిన కూటమి

Mar 13,2025 00:20

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : విద్యార్థులకు ఫీజు బకాయిలు, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు భృతి సమస్యలపై వైసిపి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక గుంటూరు రోడ్డులోని వైసిపి నియోజకవర్గ కార్యాలయం నుండి వైసిపి జిల్లా కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైసిపి కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేసి వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైసిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ యువత పోరు కార్యక్రమానికి స్వచ్ఛందంగా యువత తరలిరావడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. హామీలు అమలు చేయకుండా 9 నెలల్లో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, విద్యార్థులు, యువతను గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుందన్నారు. విద్యాదీవెన, వసతి దీవెనకు గతేడాది రూ 3,200 కోట్లు, ఈ ఏడాది రూ.3,900 కోట్లు మొత్తం రూ.7,100 కోట్లు చెల్లించాల్సి ఉంటే బడ్జెట్‌లో రూ.2,644 కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్నారని విమర్శించారు. మాజీ మంత్రి విడదల రజినీ, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డి, నంబూరి శంకర్రావు, సత్తెనపల్లి ఇంచార్జ్‌ డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు చెల్లిస్తామని చెప్పి యువత ఓట్లు దండుకుని, అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో సైతం దీని ఊసే లేదని, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసిపి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నాయి

➡️