రాష్ట్రంలో పాగాకు మతోన్మాద శక్తుల యత్నం

Jan 18,2025 00:27

సమావేశంలో మాట్లాడుతున్న బాబూరావు
ప్రజాశక్తి-గుంటూరు :
రాష్ట్రంలో పాగావేసేందుకు మతోన్మాద శక్తులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయని, వాటిపట్ల అప్రమత్తంగా వుండి ప్రతిఘటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.రామారావు అధ్యక్షతన ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. బాబూరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు ఆకాశన్నంటుతున్నాయని, మరోవైపు సాధారణ ప్రజలకు ఉపాధి తగిన విధంగా లేదని, పేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. జమిలీ ఎన్నికల పేరుతో భారత రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాసే యత్నాలు చేస్తున్నారన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పేదలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని వాగ్దానం చేసి ఇప్పుడు సర్ధుబాటు ఛార్జీల పేరుతో రూ.16 వేలకోట్లు భారం మోపిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని, ఉచిత ఇసుక విధానాన్ని అమలు పరచాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో ఇళళ్లేసుకుని నివాసముంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్ల నిర్మాణానికి కనీసం రూ.5 లక్షలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రైతులు అనేక వ్యయ ప్రయాసలకోర్చి పంటలు పండిస్తే మద్దతు ధర రావట్లేదని, మిర్చికి మద్దతు ధర కల్పించాలని కోరారు. విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులను భర్తీచేసి అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలన్నారు. స్కీమ్‌ వర్కర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలాని, ఎన్నికలకు ముందు స్కీమ్‌ వర్కర్స్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, ఎన్‌.భావన్నారాయణ, కె.నళీనికాంత్‌, ఎం.రవి, బి.వెంకటేశ్వర్లు, నాయకులు ఎల్‌.అరుణ, ఎస్‌ఎస్‌్‌.చెంగయ్య, జవహర్‌లాల్‌, పి.కృష్ణ, ఎమ్‌.ఎ.ఛిష్టీ పాల్గొన్నారు.

➡️