ప్రజాశక్తి – నార్పల అనంతపురం) : మండల పరిధిలోని బొందలవాడ గ్రామ పంచాయితీ పాలకవర్గం, కార్యదర్శి, సచివాలయ సిబ్బంది ప్లాస్టిక్ నిర్మూలనకు వినూత్నంగా ఆలోచించి జిల్లాలోని పలు పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు ఇంటి అవసరాల్లో భాగంగా వివిధ పనుల కోసం వినియోగించే సింగిల్ యూస్ కవర్లను సులువుగా సేకరించడానికి నార్పల మండలం బొందలవాడ గ్రామపంచాయతీ వినూత్నంగా ఆలోచన చేసింది. ప్రతి ఇంట్లో వాడే నూనె ప్యాకెట్లు, పాల కవర్లు, కిరాణా సామాగ్రి కవర్లు, షాంపులు, చిప్స్ కవర్లు లాంటివి ప్రతి కుటుంబం రోజుకు కనీసం 10 నుంచి 20 ప్లాస్టిక్ కవర్లు వాడుతుంటారు. వాడిన తర్వాత వాటిని రోడ్లలో వేయడం వలన పశువులు తినడం డ్రైనేజీ కాలువల్లో అడ్డుపడడం భూమిలో కలసి పోకపోవడం వలన చాలా అనర్థాలు ఉంటాయి. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి బి.శ్రీనివాసులు ఆ గ్రామంలోని బడి పిల్లలకు టీచర్ల సహకారంతో అవగాహన కల్పించి, వారి ఇండ్లలో రోజువారిగా వాడే కవర్లను వాటర్ బాటిళ్లలో నింపి మూత పెట్టి పంచాయతీ వారి కి అందించాలని, అలా తెచ్చిన పిల్లలకి మంచి బహుమతులు ఇస్తామని చెప్పడంతో పిల్లలందరూ వారి ఇంట్లో వాడే ఏ చిన్న ప్లాస్టిక్ కవరును వదలకుండా బాటిళ్లలో నింపి తీసుకొచ్చి పంచాయతీ వారికి ఇవ్వడం జరిగింది. గ్రామ పరిశుభ్రత కు వినూత్నంగా ఆలోచించి కృషి చేస్తున్న పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులను సచివాలయ సిబ్బందిని సర్పంచ్ ఆలం శిరీష, టిడిపి జిల్లా నాయకులు ఆలం వెంకటనరసనాయుడు అభినందించారు. గ్రామ సర్పంచ్ ఆలం శిరీష, పంచాయతీ పాలకవర్గం, సచివాలయ సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో బొందలవాడ పంచాయతీని ప్లాస్టిక్ రహిత పంచాయితీగా చేసి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు.
ప్లాస్టిక్ నిషేధానికి బొందల వాడ గ్రామపంచాయతీ వినూత్న ఆలోచన
