ప్రజాశక్తి-అనకాపల్లి : అనకాపల్లి జిల్లా నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కంపెనీలో వాషవాయువులు లీకైన ఘటనలో 12 మంది కార్మికులు అస్వస్ధకు గురయ్యారు. వీరిలో 9 మంది నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోను ముగ్గురు కార్మికులను తుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అస్వస్థకు గురైన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని, ఈ ప్రమాదం పై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఫార్మా పరిశ్రమల్లో కార్మికుల ప్రాణాలను యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయని అన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఫార్మా కంపెనీలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. కార్మికులకు పని ప్రదేశాల్లో భద్రత లేకుండా పోతుందని, లాభాలే పరమావదిగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి తప్ప కార్మికుల ప్రాణాలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. గతంలో ఈ పరిశ్రమలో ప్రమాదాలు సంభవించి కార్మికులు మరణించిన ఘటనలు కూడా వున్నాయన్నారు. అప్పుడే చట్టపరమైన చర్యలు తీసుకొని వుంటే ఈ ప్రమాదం సంభవించేదికాదని, రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాల పట్ల ఉదాసీనంగా వుండడం వల్లే తరుచూ ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆగ్రహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు కమిటీలు వేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలను బహిర్గతం చేసి ప్రమాదాలకు కారణమైన కంపెనీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వలనే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీల్లోనే ప్రమాదాలు అరికట్టలేని ప్రభుత్వాలు నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పేరుతో వచ్చే పెద్ద పెద్ద పరిశ్రమల్లో ప్రమాదాల పరిస్థితి ఏ విధంగా వుంటుందో అర్ధమౌతుందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ప్రమాదాలకు కారణమైన కంపెనీపై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
