ప్రజాశక్తి-అనకాపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సభకు సిపిఎం అనకాపల్లి మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ అధ్యక్షత వహిహించగా అంబేద్కర్ చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు పూలమాలవేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ సామాజిక న్యాయంకోసం జీవితాన్ని త్యాగం చేసి మనకు ఇచ్చిన రాజ్యాంగాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం తుంగలోకి తొక్కాలని చూస్తుందన్నారు. మనుధర్మ సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్ది అగ్రకుల దురహంకారాన్ని అన్ని కులాలమీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు, ఆదివాసీలు, మహిళల మీద దాడులు అమానుషంగా పెరుగుతున్నాయన్నారు. రాజ్యాంగం పరిరక్షణ కోసం కులాలకు, మతాలకతీతంగా అందరం ఐక్యంగా నిలవాలని, అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రభుత్వాలపై పోరాడడమే అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.శంకరరావు, జిల్లా కమిటీ సభ్యులు అల్లు రాజు, బి.ఉమామహేశ్వరరావు, సిపిఎం నాయకులు కె.ఈశ్వరరావు, కె.తేల్లయ్యబాబు, జి.సురేష్, పి.చలపతి, మధు తదితరులు పాల్గొన్నారు.
