ప్రజాశక్తి-పరవాడ
విశాఖ ఫార్మాసిటీలోని రాంకీ ఎప్లయిన్ వేస్టు ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు కరణం ముత్యాలు (45) మంగళవారం రాంకీ వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లో పనిచేస్తుండగా ముఖంపై కెమికల్ లిక్విడ్ పడడంతో 30 శాతం గాయాలయ్యాయి. వెంటనే విశాఖలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని పరవాడ ఎస్‌ఐ కృష్ణారావు సందర్శించి వివరాలు సేకరించి దర్యాప్తు జరుపుతున్నారు. సమాచారం అందుకున్న ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయపడిన కార్మికుడికి మెరుగైన వైద్య సేవలందించాలని, కార్మికుడు కోలుకునే వరకు పూర్తిస్థాయి వేతనం చెల్లించాలని, జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల గతంలో కూడా ఈ పరిశ్రమలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన యాజమాన్యాలు పూర్తిగా గాలికి వదిలేస్తున్నాయని మండిపడ్డారు. యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గనిశెట్టి డిమాండ్ చేశారు.