హైడ్రో పవర్‌ ప్లాంట్‌ను తిప్పికొడతాం

  • దేవరాపల్లిలో గిరిజనుల ఆందోళన

ప్రజాశక్తి – దేవరాపల్లి (అనకాపల్లి) : గిరిజనులకు, ప్రజలకు నష్టం చేకూర్చే హైడ్రో పవర్‌ ప్లాంట్‌కు ప్రభుత్వం అనుమతులిస్తే ఊరుకునేదిలేదని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, దేవరాపల్లి మండల కార్యదర్శి బిటి.దొర హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం నగరంపాలెం ప్రాంతంలో హైడ్రో పవర్‌ ప్లాంట్‌ ప్రతిపాదిత స్థలంలో స్థానిక గిరిజనులతో కలిసి సంప్రదాయ విల్లంభులు, ఆయుధాలు చేబూని గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అదానీ ఏజెంట్లతో కలిసి డిఎఫ్‌ఒ రహస్యంగా సర్వే చేపట్టడం దారుణమన్నారు. ఈ ప్రాంతంలో హైడ్రో పవర్‌ పవర్‌ ప్లాంట్‌ పెట్టొద్దని కొంత కాలంగా గిరిజనులు ఆందోళన చేస్తుంటే రహస్యంగా సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. నగరంపాలెం గ్రామానికి జల్‌ జీవన్‌ మిషన్‌లో మంచినీటి పథకాన్ని మంజూరు చేస్తే ఆ ప్రాంతం ఫారెస్ట్‌ ఏరియాలో ఉందని చెప్పి పైపులైన్‌ వేయకుండా అడ్డుకున్న ఫారెస్టు అధికారులు ఇప్పుడు అదానీ ఏజెంట్లకు సహయపడుతుండటం శోచనీయమన్నారు. అదానీ కన్ను రైవాడ, కోనాం ప్రాజెక్టులపై పడిందని తెలిపారు. అత్యంత కీలకమైన ఆ ప్రాజెక్టులు అదానీ చేతికి చిక్కితే ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ముఖ్యంగా గిరిజనుల బతుకులు బుగ్గిపాలవుతాయన్నారు. రైవాడ, కోనాం ఆయకట్టు భూములు ఎడారిగా మారతాయన్నారు. ఇప్పటికే అదానీ ఏజెంట్లు దేవరాపల్లిలో కార్యాలయ నిర్మాణానికి భూపరిశీలన మొదలుపెట్టినట్టు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తెరిగి ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న పంచాయతీల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు రాజకీయాలకు అతీతంగా రైతులను చైతన్యపరిచి హైడ్రో పవర్‌ ప్లాంట్‌ను అడ్డుకోవాలని కోరారు. పవర్‌ ప్లాంట్‌తో ఎక్కడెక్కడ ఏయే గ్రామాలు నష్టపోనున్నాయో వివరించారు. కొంత మంది స్వార్థపరుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని తెలిపారు. అటవీ చట్టాలను ఉల్లంఘించి ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో రవి, రామకృష్ణ, పోతురాజు పాల్గొన్నారు.

➡️