నులిపురుగుల నిర్మూలన దినం పోస్టర్‌ ఆవిష్కరణ

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం ఈనెల 10న నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌ కార్యాలయంలో మంగళవారం నులిపురుగుల నిర్మూలన దిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఒకటి నుంచి 19 సంవత్సరాల వయసు గల అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, పాఠశాలకు వెళ్లని వారు, కౌమార బాల బాలికలకు ఆల్బెండజోల్‌ మాత్రలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఒకటి నుంచి రెండు సంవత్సరాల వయసు గల పిల్లలకు అరమాత్ర, మిగిలిన వారు పూర్తి మాత్రను వేసుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. 10వ తేదీన మాత్ర వేసుకోని వారు ఈనెల 17న తప్పక వేసుకోవాలన్నారు. విద్యాశాఖ, మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఇతర శాఖల సహకారంతో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ ఆర్‌ బి ఎస్‌ కే డాక్టర్‌ ప్రశాంతి పాల్గొన్నారు.

➡️