- అనకాపల్లి విజయరామరాజుపేట వద్ద పక్కకు ఒరిగిన రైల్వే ట్రాక్
- గూడ్స్ లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన ముప్పు
ప్రజాశక్తి – అనకాపల్లి : అనకాపల్లి విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి వద్ద సోమవారం తెల్లవారుజామున భారీ లోడుతో వెళ్తున్న గుర్తు తెలియని లారీ రైల్వే బ్రిడ్జి సేఫ్టీ గిర్డర్‌ను ఢకొీట్టింది. అది రైల్వే ట్రాక్‌ను బలంగా తాకడంతో ట్రాక్ పక్కకు ఒరిగింది. ఇదే సమయంలో ట్రాక్‌పై ఓ గూడ్స్ రైలు వస్తుంది. ట్రాక్ ఒరిగి ఉండడాన్ని లోకో పైలట్ గమనించి అత్యవసర బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో పలు రైళ్లకు అంతరాయం కలిగింది. మూడు గంటలపాటు రైల్వే అధికారులు శ్రమించి ట్రాక్‌ను పునరుద్ధరించారు. ప్రమాద విషయం తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అక్కడకు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. టిడిపి నాయకులు సురేంద్ర, జోగి నాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి భీమరశెట్టి రామకృష్ణ (రాంకీ), సిపిఐ నాయకులు రాజాన దొరబాబు, తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు.
నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం : సిపిఎం
ప్రమాదంపై మీడియాతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ..క్వారీల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా పరిమితికి మించి హెవీ లోడ్‌లతో వాహనాలను తిప్పుతుండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జిలు ఉన్న ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా అధికారుల నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు.