అనంతలో ఆగని టిడిపి టికెట్‌ సెగ

టిడిపి కార్యాలయం వద్ద కరపత్రాలను దహనం చేస్తున్న ప్రభాకర్‌చౌదరి మద్దతుదారులు

           అనంతపురం కలెక్టరేట్‌ : టిడిపి అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం టికెట్‌ చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కన్పించడం లేదు. నియోజకవర్గం ఇన్‌ఛార్జి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరికి టికెట్టు ఇవ్వకపోవడంతో ఆయన మద్దతుదారులు శనివారం నాడు కూడా నిరసనను కొనసాగించారు. నగరంలోని పలు డివిజన్‌, గ్రామ పంచాయతీల్లోని టిడిపి కార్యాలయాలను ధ్వంసం చేశారు. ఎన్నికల సామగ్రి, ఫర్నిచర్‌, టిడిపి జెండాలు, సిక్స్‌ ప్యాక్‌ కిట్లు, కరపత్రాలను నిప్పు పెట్టి కాల్చివేశారు. ఇదే సమయంలో వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి తన నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రభాకర్‌చౌదరిని అభిమానించే నారాయణపురం పంచాయతీకి చెందిన భార్యాభర్తలు నాగరాజు, మమత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్యాభర్తలను ప్రభాకర్‌చౌదరి పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. రుద్రంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్‌ సూపర్‌ సిక్స్‌ క్యాలెండర్లు, జెండాలు, లోకేష్‌ ఫ్లెక్సీలు, కటౌట్‌లను రోడ్డుపై అంటించారు.

➡️