‘అనంత’లో మేమంతా సిద్ధం

మహిళలతో మాట్లాడుతున్న జగన్మోహన్‌రెడ్డి

         అనంతపురం ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర శనివారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. నాలుగో రోజు ఉదయం కర్నూలు జిల్లాలో తుగ్గలి ప్రారంభమైన యాత్ర సాయంత్రానికి అనంతపురం జిల్లాకు చేరుకుంది. గుత్తి మండలం బసినేపల్లి వద్ద జిల్లాలోకి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రవేశించారు. సరిహద్దుల్లో వైసిపి ముఖ్య నాయకులు పెద్దఎత్తున ఆయన స్వాగతం పలికారు. అక్కడి నుంచి గుత్తి పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. పట్టణంలో దారి పొడవునా వైసిపి నాయకులు, అభిమానులు వైసిపి జెండాలను చేతబట్టుకుని ముఖ్యమంత్రికి మద్దతు పలికారు. అక్కడి నుంచి పామిడి, కల్లూరు, గార్లదిన్నె మీదుగా రాప్తాడు వరకు యాత్ర సాగింది. మొత్తం జాతీయ రహదారి 44పైనే ఈ యాత్ర సాగడంతో వాహనాల రాకపోకలకు కొంత అంతరాయం కలిగింది. యాత్రలో ఎక్కడా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మాట్లాడలేదు. కేవలం అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అక్కడక్కడ వృద్ధులు, మహిళలు, పిల్లలను పలకరిస్తూ ముందుకు కదిలారు.

వైసిపిలోకి టిడిపి కళ్యాణదుర్గం ఇన్‌ఛార్జి మాదినేని ఉమా

          ముఖ్యమంత్రి పర్యటన జిల్లాలోకి ప్రవేశించకముందే టిడిపికి షాక్‌ తగిలింది. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న మాదినేని ఉమామహేశ్వర నాయుడు టిడిపిని వీడి వైసిపిలో చేరారు. ఈ మేరకు ఆయన రాయలసీమ వైసిపి ఇన్‌ఛార్జీగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాప్తాడు తాజా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, అనంతపురం పార్లమెంట్‌ అభ్యర్థి శంకర నారాయణ, కళ్యాణదుర్గం వైసిపి అభ్యర్థి తలారి రంగయ్యలతో కలసి తుగ్గలికి వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతోపాటు నియోజకవర్గంలోని ఇతర టిడిపి నాయకులు కూడా వైసిపిలో చేరారు.

మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా తిరిగి వైసిపి గూటికేనా ?

        కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా తిరిగి వైసిపిలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. 2014లో వైసిపి తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా చాంద్‌బాషా గెలుపొందారు. తరువాత ఆయన వైసిపిని వీడి టిడిపిలో చేరారు. 2019 ఎన్నికల్లో టిడిపి టిక్కెట్టు ఆశించి భంగపడ్డారు. ఈసారి కూడా ఆయనకు కాకుండా కందికుంట వెంకట ప్రసాద్‌కే టిక్కెట్టును ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన టిడిపిని వీడి వైసిపిలో మళ్లీ చేరుతారని ప్రచారం నడుస్తోంది. అది కూడా మేమంతా సిద్ధం యాత్రలోనే ముఖ్యమంత్రి సమక్షంలో వైసిపిలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

➡️