అనంత బాలోత్సవం – 2024ను జయప్రదం చేద్దాం

Feb 9,2024 22:35

పోస్టర్లు విడుదల చేస్తున్న బాలోత్సవ కమిటీ సభ్యులు, తదితరులు

                 అనంతపురం కలెక్టరేట్‌ : పిల్లల పండుగ అనంత బాలోత్సవం-2024ను జయప్రదం చేద్ధామని ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ దివాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అనంత బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన బాలోత్సవం పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగానే అనంత బాలోత్సవ కమిటీ, ఆర్ట్స్‌ కళాశాల సంయుక్తంగా ఈ సంవత్సరం కూడా అనంత బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి అనంత బాలోత్సవం చక్కటి వేదికగా నిలిచిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు అత్యధికంగా పాల్గొనేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్ట్స్‌ కళాశాల అధ్యాపకురాలు అరుణశ్రీ మాట్లాడుతూ పిల్లల్లోని నైపుణ్యాలను వెలికితీయడానికి అనంత బాలోత్సవం దోహదపడుతోందన్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు ఆర్ట్స్‌ కళాశాల ఎగ్జిబిషన్‌ మైదానంలో బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంత బాలోత్సవ కార్యనిర్వాహక కార్యదర్శి వి.సావిత్రి మాట్లాడుతూ విద్యార్థులు పాల్గొనే ఈవెంట్స్‌లపై రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న మేరకు ఏ రోజుకు ఆరోజే విద్యార్థులు హాజరై తమ కళలను ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్‌ కళాశాల అధ్యాపకుడు లక్ష్మికాంత్‌, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు రామాంజినమ్మ, నాయకులు గీత, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్‌, నాయకులు సోము తదితరులు పాల్గొన్నారు.

➡️