‘అనంత’ బాలోత్సవాన్ని జయప్రదం చేద్దాండి

'అనంత' బాలోత్సవాన్ని జయప్రదం చేద్దాండి

డిఇఓ వరలక్ష్మికి ఆహ్వాన పత్రికను అందజేస్తున్న అనంత బాలోత్సవ కమిటీ సభ్యులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

పిల్లల పండుగ అనంత బాలోత్సవం-2024ను జయప్రదం చేద్దామని జిల్లా విద్యాశాఖ అధికారిణి వరలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం అనంత బాలోత్సవం కమిటీ సభ్యులు డిఇఒను కలిసి బాలోత్సవ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనంత బాలోత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అనంత బాలోత్సవం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పిల్లల పండుగకు ప్రత్యేకత ఉందన్నారు. ఈనెల 12, 13, 14వ తేదీల్లో ఆర్ట్స్‌ కళాశాల ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహిస్తున్న బాలోత్సవాలకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరవుతున్నట్లు తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీయడానికి అనంత బాలోత్సవం దోహదపడుతుందన్నారు. సెల్‌ఫోన్‌లు, వీడియో గేమ్స్‌ వంటి వాటికే బాల్యం పరిమితమవుతున్న తరుణంలో పిల్లల పండుగను విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు. అనంతరం డిఇఒ మాట్లాడుతూ పిల్లల తెలివితేటలు, సృజనాత్మకతను వెలికి తీయడానికి బాలోత్సవం చక్కటి వేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో అనంత బాలోత్సవం కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వి.సావిత్రి, కమిటీ కోశాధికారి జిలాన్‌, సభ్యులు లింగమయ్య, కోటేశ్వరప్ప, గోవిందరాజులు, రమణయ్య, రామాంజనమ్మ, ప్రజ్ఞ సురేష్‌, ఎల్లార్‌ వెంకటరమణ, వీరుపాక్షి, ఈరన్న చిలుకూరి దీవెన, రోహిణి, యామిని, పురంధరుడు తదితరులు పాల్గొన్నారు.

విజయవంతానికి ముందస్తు ప్రణాళికలు

అనంత బాలోత్సవం-2024 అకడమిక్‌ విభాగం పోటీల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు అనంత బాలోత్సవం అకడమిక్‌ విభాగం న్యాయ నిర్ణేతలు తెలిపారు. శనివారం జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యాలయంలో అకడమిక్‌ విభాగం కన్వీనర్‌ ఎస్‌వివి.రమణయ్య అధ్యక్షతన అనంత బాలోత్సవం అకడమిక్‌ విభాగం న్యాయ నిర్ణేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత బాలోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వి.సావిత్రి, కోశాధికారి జిలాన్‌ హాజరై అకడమిక్‌ విభాగం సంబంధించి పద్యరచన, వకృత్వం, పద్యం, భావం, మ్యాప్‌, క్విజ్‌, మట్టితో బొమ్మలు, కథా రచన వంటి 36 అంశాలపై న్యాయ నిర్ణేతలను నియమించారు. అనంతరం ఏఏ అంశాలపై చర్చించాలి, ఏ సమయానికి హాజరు కావాలి, వారికి కావాల్సిన మేటిరియల్‌ వంటి అంశాలపై చర్చించారు. గతంలో జరిగిన లోటుపాట్లు పునరావృతం కాకుండా వాటిని నివృత్తి చేసుకుని విజయవంతం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో అనంత బాలోత్సవం అకడమిక్‌ విభాగం న్యాయనిర్ణేతలు లింగమయ్య, కోటేశ్వరప్ప, గోవిందరాజులు, సురేష్‌, నాగేంద్ర, లక్ష్మినారాయణ, గోవిందరెడ్డి, నరేంద్ర, దేవేంద్రమ్మ, రోహిణీ, పారిజాత కుమారి, నబీరసూల్‌, లక్ష్మిదేవి, మధురశ్రీ తదితరులు పాల్గొన్నారు.

➡️