‘ఉపాధి’లో అక్రమాలు : వ్యకాసం

విలేకరులతో మాట్లాడుతున్న వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి

             బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం మండలంలోని పలు గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు తెరలేపి బిల్లులు కాజేశారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుక్కరాయసముద్రం మండలంలోని పసులూరులో రూ.3,04,961, చెదుళ్లలో రూ..1,97,332, జంతులూరులో రూ.16,093 ఉపాధి నిధులను అధికార పార్టీ నాయకులు స్వాహా చేశారన్నారు. ఈ అవినీతిలో పాల్పడిన వారిలో అధికార పార్టీ జెసిఎస్‌ కన్వీనర్‌, మండల ముఖ్య నాయకుడు, మరొకరు సర్పంచి ఉన్నారన్నారు. ఉపాధిలో యంత్రాలను వాడకూడదని ఉన్నా పైగ్రామాల్లో జెసిబీలను పెట్టి చేయించారన్నారు. పసూలు గ్రామంలో అధికార పార్టీకి చెందిన కుటుంబ సభ్యులు ఉపాధి హామీ పథకంలో పనులు చేయకుండానే చేసినట్టు చూపి లక్షల రూపాయలు నిధులు కాజేశారన్నారు. ఇందులో మస్టర్లు ఇచ్చింది ఉపాధి సిబ్బంది అయితే, పని చేయకుండానే వేసినట్లు మస్టరు వేసిందని వైసిపి నాయకుడు బయపరెడ్డి బంధువన్నారు. అధికార పార్టీ జెసిఎస్‌ మండల నాయకుడు వసలూరు బయపరెడ్డి అన్నదమ్ములు బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఉంటారన్నారు. ఈ కుటుంబంలో ఎవరూ బయటి పనులకు వెళ్లరన్నారు. అయితే ఈయన కుటుంబ సభ్యులు ఉపాధి హామీ పథకంలో పనులకు వెళ్తున్నట్లు చూపి నిధులను కాజేశారన్నారు. శింగనమల నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి నమ్మినబంటుగా ఉన్న ఈయన ఉపాధిని ఉపయోగించి అప్పనంగా నిధులు దోచేశరన్నారు. పసలూరు బయపరెడ్డికి సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 89 రోజులు పనులు చేసినట్లు చూపి రూ.17,879 లబ్ది పొందారు. ఇందులో 53 రోజులు బయపరెడ్డి పనులకు వెళ్లినట్లు ఉందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 14 రోజులు పనులు చేసినట్లు చూపి రూ.3414 బిల్లులు చేయించుకున్నారన్నారు. ఇలా పలుసార్లు ఉపాధి పనులకు వెళ్లకున్నా వెళ్లినట్లు చూపి బిల్లులు కాజేశారన్నారు. వీటికి సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులు పసులూరు తదితర గ్రామాల్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగేంద్ర, సంజీవరెడ్డి, నెట్టికల్లు తదితరులు పాల్గొన్నారు.

➡️