కాంగ్రెస్‌లో జోష్‌

అనంతపురంలో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో పాల్గొన్న కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలరెడ్డి, సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, రామకృష్ణ

      అనంతపురం ప్రతినిధి : కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారాన్ని అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించింది. తొలి ప్రచార సభకు ఎఐసిసి (అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షులు) మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ఇండియా వేదికలోనున్న సిపిఎం, సిపిఐ నుంచి ఆ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణలు పాల్గొన్నారు. ముఖ్యనేతలంతా ఈ సభకు వస్తుండటంతో జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్‌ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలొచ్చారు. అనంతపురం నగరంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగిన ఈ సభకు వేలాదిగా జనం రావడంతో కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో కొత్త జోష్‌ కనిపించింది. అదే సమయంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయలు ఇందిరమ్మ అభయం పేరుతో గ్యారెంటీ ఇస్తామని మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ హామీ ప్రకటించగానే బహిరంగ సభలో ఉన్న జనం అంతా కరతాల ధ్వనులతో అభినందనలు తెలిపారు. మల్లికార్జున ఖర్గే కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రసంగించగా, దాన్ని సిడబ్ల్యుసి సభ్యులు ఎన్‌.రఘువీరారెడ్డి తెలుగులోకి అనువదించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల ప్రసంగిస్తున్న సమయంలో సభలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

కార్పొరేట్‌కు దేశ సంపద : ఖర్గే

కేంద్రంలో అధికారంలోనున్న బిజెపి దేశంలో ప్రజా సంపదను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోందని ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే విమర్శించారు. దేశంలో కాంగ్రెసు బలహీనంగా ఉందని ఆరోపించే మోడీ, తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను చూసి మోడీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే నిరంతరం రాహుల్‌, సోనియాగాంధీతో పాటు తనను విమర్శిస్తుంటారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా బిజెపి పూర్తి చేసిందాని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తూనే నల్లధనమంతా తెచ్చి ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు జమచేస్తామని హామీనిచ్చిందన్నారు. అది ఇప్పటికైనా అమలైందా అన్నారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయకున్నా రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేనలు వంగివంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడ బిజెపి అంటే బాబు, జగన్‌, పవన్‌కళ్యాణ్‌ అన్న చందంగా మారిందన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. పేద ప్రజలకు అండ కాంగ్రెస్‌ పార్టీన అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెసు, వామపక్షాలను గెలపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బిజెపిని ప్రశ్నించలేని వైసిపి, టిడిపి

ఎపి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల

             కేంద్రంలోని బిజెపి 2104లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకున్నా ప్రశ్నించలేని స్థితిలో రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు వైసిపి, టిడిపి ఉన్నాయని ఎపి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల విమర్శించారు. ప్రత్యేక హోదా రాలేదు… రైతులకు మద్దతు ధరను ఇవ్వలేదన్నారు. టిడిపి, వైసిసి పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో కేంద్రంపై పోరాటం చేసి ఉంటే సాధించుకునే అవకాశం ఉండేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని, ప్రకృతి వైపరిత్యాల సమయంలో పంటనష్టపోతే రైతులను ఆదుకునేందుకు నాలుగు వేల కోట్లతో మరో నిధిని ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు హామీనిచ్చారని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లలో ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసే పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.

మతతత్వ బిజెపిని గద్దె దించాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

          ప్రజల మధ్య మతచిచ్చురాజేసి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్న బిజెపిని వచ్చే ఎన్నికల్లో గద్దెదించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్‌ను అటో..ఇటో తేల్చబోయే ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో మతత్వ బిజెపిని గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇండియా వేదిక బిజెపికి సమాధి కట్టడానికి సిద్ధమైందన్నారు. విభజన హామీలను అమలు చేయని బిజెపి, దానికి మద్దతుగా నిలిచిన వైసిపి, టిడిపి, జనసేనలను ఇంటికి పంపాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు.

దేశం,రాష్ట్రంలో నియంత పాలన

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

దేశం, రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. అక్కడా…ఇక్కడా రెండు ప్రభుత్వాలు కూడా పోలసులను అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. 10 ఏళ్ల మోదీ పాలనలో చెప్పుకోవడానికే ఏమీ లేదన్నారు. మతతత్వం, దేవాలయ రాజకీయాలే ఉన్నాయన్నారు. రైతులు ఢిల్లీలో పోరాటానికి వెళ్తుంట రోడ్లలో మేకులు గుచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. అభివృద్ధిని విస్మరించి మతత్వంతో ముందుకొస్తున్న బిజెపికి, దానికి మద్దతుగా రాష్ట్రంలో నిలిచిన టిడిపి, వైసిపి, జనసేనలను ఓడించాలని పిలుపునిచ్చారు.

➡️