కూలీలకు మెరుగైన వైద్యచికిత్సలు అందించాలి : సిపిఎం

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలతో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

              అనంతపురం కలెక్టరేట్‌ : వజ్రకరూరు మండలం పాల్తూరు వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించి ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. గాయపడి అనంతపురం సర్వజన ఆసుత్రిలో చికిత్స పొందుతూ కూలీలను సిపిఎం నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మిరప కోత కూలి పనులకు వెళ్తున్న బొలేరో వాహనం బోల్తా పడి 40 మంది కూలీలు గాయపడడం విచారకరం అన్నారు. జిల్లాలో కరువు పరిస్థితుల వల్ల గ్రామాల్లో పనులు లేక కూలీలు ఇతర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. రూ.200 కూలి కోసం వజ్రకరూరు నుంచి విడపనకల్‌ మండలం పాల్తూరు గ్రామానికి కూలీలు వెళ్తున్నారంటే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇరుకైన వాహనాల్లో ఎక్కువ మంది కూలీలు పనుల కోసం వెళ్లడం, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పెద్ద సంఖ్యలో పేదలు ప్రాణాలు కోల్పోవడం, గాయపడడం లాంటి ఘటనలు జరుగుతుండడం అత్యంత విచాకరం అన్నారు. గ్రామీణ ఉపాధి పనులకు కేంద్రం నిధుల ఇవ్వకుండా కోత కోస్తోందన్నారు. దీనిని ప్రశ్నించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. ఉరవకొండ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యవసాయ కూలీలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. గాయపడిన ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప ఎం.బాలరంగయ్య, నగర కార్యదర్శులు ఆర్‌వి.నాయుడు, రామిరెడ్డి, నగర నాయకులు ప్రకాష్‌, వలీ బాబు, సురేష్‌, జీవ, రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️