చంద్రబాబుతోనే బిసిల అభివృద్ధి

చంద్రబాబుతోనే బిసిల అభివృద్ధి

‘జయహో బిసి’లో మాట్లాడుతున్న మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు

ప్రజాశక్తి-గుమ్మగట్ట

టిడిపి అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రంలోని బిసి అభివృద్ధి సాధ్యమని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం మండల పరిధిలోగల కలుగోడు గ్రామంలో కాలువ సన్నన్న ఆధ్వర్యంలో జయహో బిసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన గుమ్మగట్ట మండలానికి తనవంతుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. ముఖ్యంగా భైరవాణితిప్ప ప్రాజెక్టుకు (బిటిపి) కృష్ణాజలాలను రూ.968 కోట్లతో ప్రాజెక్ట్‌ ప్రారంభించి 30 శాతం వరకూ పనులు చేశామన్నారు. తర్వాత వైసిపి అధికారంలోకి రావడంతో ప్రాజెక్టును పూర్తిగా విస్మరించిందన్నారు. అంతేకాకుండా బీసీ కార్పొరేషన్‌కు నిధులు ఇవ్వకుండా, సబ్సిడీ రుణాలు లేకుండా చేసిన ఘనత వైసిపికే దక్కుతుందన్నారు. ప్రతిసభలోను ‘నా ఏస్సీ.. నా ఎస్టీ.. నా బిసి.. నా మైనారిటీ..’ అని చెప్పుకునే సిఎం ఆయా వర్గాలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసి కూలీలుగా మారుస్తున్నాడన్నారు. విదేశీ విద్య ఎక్కడా కనబడడం లేదన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ పేరును కూడా మార్చిన ఘనత జగన్‌దే అని ఎద్దేవా చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక దాదాపుగా 76 మంది టిడిపి బిసి కార్యకర్తలను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.150 కోట్లతో వడ్డెర్లకు జెసిబిలు, నాయీ బ్రాహ్మణులకు పనిముట్లు, రజకులకు దోబీఘాట్టు కటించామని గుర్తు చేశారు. ఇవన్నీ తిరిగి రావాలంటే వచ్చే ఎన్నికల్లో టిడిపిక ఓటు వేసి చంద్రబాబును సిఎంను చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షులు కృష్ణ, జనసేన నాయకులు మంజునాథ్‌గౌడ్‌, పట్టణ అధ్యక్షులు పసుపులేటి రాజు, మండల అధ్యక్షులు గిరి మల్లప్ప, గుమ్మఘట్ట సర్పంచి విజయలక్ష్మి, వీరాపురం సర్పంచి నాగరాజు, రాయదుర్గం కౌన్సిలర్లు భారతి, కేతు దొడ్డి రాజు, తిప్పయ్య, దానవేంద్ర, ఉస్మాన్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️