నన్ను విమర్శించి ‘మెట్టు’ను గెలిపించలేరు..

నన్ను విమర్శించి 'మెట్టు'ను గెలిపించలేరు..

మాట్లాడుతున్న విప్‌ కాపు రామచంద్రారెడ్డి

ప్రజాశక్తి-రాయదుర్గం

‘నన్ను విమర్శించడం వల్ల వైసిపి అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిని గెలిపించలేరు’ అని విప్‌ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. వైసిపి రైతు విభాగ ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్‌గా కాపు రామచంద్రారెడ్డి ఆదివారం సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనను విమర్శించడం వల్ల గోవిందరెడ్డి గెలుస్తాడంటే విమర్శించవచ్చు.. అయితే ఎవరి ఎన్నిక విషయంలో ఎవరిని విమర్శిస్తారనే విషయాన్ని గుర్తు పెట్టుకుని విమర్శించాలన్నారు. 2009 ఎన్నికల్లో ఉపేంద్రరెడ్డి రాయదుర్గం పురపాలక సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు అతడి వెంట 29 మంది వార్డు సభ్యులు ఉన్నారన్నారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ పాలకమండలి పదవిని సగం కాలం చేనేతలకు ఇస్తారని చెప్పి ఎందుకు ఇవ్వలేదో మీకే తెలియాలన్నారు. మీరే ఐదేళ్లపాటు ఎందుకు మున్సిపల్‌ ఛైర్మన్‌గా కొనసాగారో కారణాలు ప్రజలకు తెలుసన్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేసిన తనతో విభేదించి తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ తరపున ఉపేంద్ర రెడ్డి ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుకు చేశారు. మీరు ఏవైపున ఉంటే ఆ పార్టీకి పట్టణంతోపాటు మీ వార్డుల్లోనూ ఓట్లు మైనస్‌ అయ్యాయన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాయదుర్గంలో ఉపేంద్రరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. అందుకు ఎన్ని కారణాలైన ఉండవచ్చన్నారు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో 30 మంది వార్డు సభ్యులు మీవైపు ఉన్నారని, రాయదుర్గంలో, మీ వార్డులోనూ వైసిపికి ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా కష్టపడి పని చేసి ఈసారైనా మెట్టు గోవింద రెడ్డిని గెలిపించుకోవాలని హితవు పలికారు. మీరు ఎవరిని సపోర్ట్‌ చేస్తే ఆ వార్డులో మెజారిటీ రాదని నిందను తొలగించుకోవాలని సూచించారు. పల్లేపల్లిలోనూ గత పంచాయతీ ఎన్నికల్లో వైసిపి సానుభూతి సర్పంచి ఓడిపోగా ఈసారి అక్కడ అందరూ కష్టపడి అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపికి మెజారిటీ వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. తనను విమర్శించిన వారి స్థాయివారితోనే త్వరలోనే కౌంటర్‌ ఇప్పిస్తామన్నారు. ఇది కౌంటర్‌ కాదని.. తప్పుగా అర్థం చేసుకోవద్దని.. ఓ బావగా సలహా ఇస్తున్నానని వీడియో ముగించారు.

➡️