ప్రతిష్టాత్మకంగా ‘జగనన్న పాలవెల్లువ’

Feb 9,2024 22:36

మహిళలతో మాట్లాడుతున్న కలెక్టర్‌

                       బుక్కరాయసముద్రం : జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కింద పాల సేకరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం రూరల్‌ పరిధిలోని రాచానపల్లి, బుక్కరాయసముద్రం మండలంలోని కొర్రపాడు-2 (బోడిగానిదొడ్డి) గ్రామం వద్దనున్న జగనన్న పాలవెల్లువ, మహిళా డైరీ సహకార సంఘాలను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, జిల్లా పరిషత్‌ సీఈవో నిదియాదేవి తదితరులు పాల్గొన్నారు. ముందుగా అనంతపురం రూరల్‌ పరిధిలోని రాచానపల్లి గ్రామం వద్దనున్న జగనన్న పాలవెల్లువ, మహిళా డైరీ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 13, 14 వ తేదీల్లో జగనన్న పాలవెల్లువ కింద పాలసేకరణ చేపట్టడం జరుగుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ఈనెల 13వ తేదీలోపు కేటాయించిన పనులను పూర్తి చేయాలన్నారు. పాల సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిష్టాత్మకంగా పనులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో ఎంపిడిఒ, వెటర్నరీ డాక్టర్‌, రూట్‌ ఇన్‌ఛార్జి, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ తదితరులు పాల ఉత్పత్తిదారులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. అమూల్‌కు పాలు పోయడం ద్వారా లీటర్‌కు అయిదు రూపాయలు అదనంగా వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేయాలన్నారు. బిఎంసియుకి విద్యుత్‌ సరఫరా మూడు రోజుల్లోపు అందించాలన్నారు. పాల రవాణాకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పాల సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం బుక్కరాయసముద్రం మండలంలోని కొర్రపాడు-2 (బోడిగానిదొడ్డి) గ్రామం వద్దనున్న జగనన్న పాలవెల్లువ, మహిళా డైరీ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారా అనేది పరిశీలించాలన్నారు. ఈ డైరీ పరిధిలోని ఎఎంసీయూలను తనిఖీ చేయాలని, అక్కడ సిబ్బందికి పాల సేకరణపై శిక్షణ ఇవ్వాలనొ అన్నారు. గ్రామాల వారీగా పాల ఉత్పత్తిదారులకు రీఓరింటేషన్‌ ఇవ్వాలని, పాలు పోయడం ద్వారా వచ్చే లాభాల వివరాలు తెలపాలని చెప్పారు. ఈ విషయమై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. నిర్దేశించిన సమయంలోగా ఎలాంటి పనులు పెండింగ్‌ ఉంచకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జీ.వెంకటేష్‌, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రహ్మణ్యం, డిసిఒ ప్రభాకర్‌ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సురేంద్ర, డైరీ మేనేజర్‌ నారాయణమ్మ, పిఆర్‌ ఎస్‌ఈ, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, రాచానపల్లి సర్పంచి ఆంజనేయులు, ఎంపీటీసీ గౌస్‌, పంచాయతీ సెక్రటరీ రామకృష్ణ, బోడిగానిదొడ్డి ఉప సర్పంచి శ్రీనివాసులు రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️