మోడీది ప్రచారఆర్భాటమే : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

                 అనంతపురం ప్రతినిధి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతా ప్రచార అర్భాటమే తప్ప, రాష్ట్రానికి చేసిందేమీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. 2019లోనే మంగళగిరిలోని ఎయిమ్స్‌ ప్రారంభమై వైద్యసేవలందుతున్నాయని ఆయన తెలిపారు. దానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్‌గా ప్రారంభించి రాష్ట్రానికి ఏదోచేసినట్టు ఎన్నికల ముందు ప్రచారం చేసుకునే పని చేస్తున్నారని విమర్శించారు. అనంతపురం నగరంలోని గణేనాయక్‌ భవనంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బిజెపి రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడారు. ఎయిమ్స్‌కు రూ.1600 కోట్ల నిధులు అవసరం కాగా రూ.420 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు ఖర్చు పెట్టారని తెలిపారు. అక్కడున్న సిబ్బంది తక్కువగానున్నా మెరుగైన వైద్య సేవలందించేందుకు కషి చేస్తున్నారని వివరించారు. దాన్ని తామేదో చేసినట్టు చెప్పుకునేందుకు ప్రారంభమైన దానికి మరోమారు ప్రారంభోత్సవం చేయడం గమనార్హమన్నారు. రాష్ట్రానివ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు… పోలవరం లేదు… వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా అన్ని విధాలా కేంద్రం మోసం చేసిందని అని గుర్తు చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఇప్పటి నాలుగు సార్లు శంకుస్థాపనలు చేసారు తప్ప పనులు ముందుకు జరగలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి జందాల్‌ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి శంకుస్థాపన చేసారన్నారు. అది కూడా ముందుకు సాగలేదని విమర్శించారు. అంతకు మునుపు కడప ఉక్కు పరిశ్రమ కోసం కేటాయించిన ఓబుళాపురం గనులను ఇప్పుడు జిందాల్‌ సంస్థకు కేటాయించారని తెలిపారు. ముందు నుంచి అడుగుతున్న విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇప్పటి వరకు గనులు కేటాయించలేదని చెప్పారు. వైద్యరంగానికి దేశ జిడిపిలో 2.57 శాతం కేటాయించాలని అనేక నివేదికలు చెబుతున్నా 0.57 శాతమే కేటాయించారని తెలిపారు. తద్వారా ప్రజలపై వైద్యం ఖఱ్చుల భారం పెరుగుతోందన్నారు. 76 శాతం వైద్య ఖర్చులను ప్రజలే సొంతంగా భరించే పరిస్థితులున్నాయని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిడిపిలో 2.57 శాతం, బడ్జెట్‌లో 18 శాతం నిధులను వైద్యరంగానికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అటు కేంద్రంలోని బిజెపి, ఇటు రాష్ట్రంలోని వైసిపి రెండూ ప్రభుత్వ పథకాలపై తమ బొమ్మలు వేసుకోవడంపై చూపుతున్న శ్రద్ధ ప్రజలకు మేలు చేయడంపై లేదని విమర్శించారు. కనీస మద్దతు ధరకు గ్యారెంటీ చేస్తూ చట్టం చేయాలని, విద్యుత్‌ సంస్కరణలను నిలిపేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం అన్నిరకాలా నిర్బంధాలను ప్రయోగిస్తోందన్నారు. ఇప్పటి వరకు ఐదు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకుండా ఉందన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించడంపై చూపుతున్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్రంలోని బిజెపి చూపడం లేదని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో అభివద్ధి అంశాలను పక్కనబెట్టి మోడీ మతోన్మాదాన్ని పెంచే విధంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మొన్నటి వరకు శ్రీరాముడి పేరుతో రాజకీయం చేయగా ఇప్పుడు శ్రీ కష్ణుడిని, పరమేశ్వరుడి పేరుతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తునారని మండిపడ్డారు. ఇటువంటి బిజెపితో రాష్ట్రంలోని టిడిపి జతకడుతోందన్నారు. అమిత్‌షాతో చంద్రబాబు జరిపిన రహస్య చర్చల గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. వారి చర్చల్లో రాష్ట్ర ప్రయోజనాలేమున్నాయో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందని కోరారు. విభజన హామీల్లో ఏవి అమలు చేస్తామని బిజెపి చెప్పిందో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌, వామపక్షాలతోపాటు కలిసొచ్చే లౌకికవాద పార్టీలతో కలసి పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నల్లప్ప, బాలరంగయ్య, సిపిఎం నగర కార్యదర్శులు రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️