అనంత అభివృద్ధి నా బాధ్యత

అనంతపురం శంఖారావ సభలో అభివాదం చేస్తున్న నారా లోకేష్‌, టిడిపి, జనసేన నాయకులు

      అనంతపురం కలెక్టరేట్‌ : ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే తమకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. టిడిపి అధికారంలోకి రాగానే ఈ జిల్లా అభివృద్ధి బాధ్యతను నేను తీసుకుంటాను’ అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తెలియజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేపట్టిన శంఖారావ సభలు సోమవారంతో ముగిశాయి. సోమవారం నాడు అనంతపురం, తాడిపత్రి నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలనను నిర్వహించారు. అనంతపురం రుద్రంపేట బైపాస్‌ పివికెకె కళాశాల సమీపంలో అర్బన్‌ నియోజకవర్గం ఇన్‌ఛార్జి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, తాడిపత్రి పట్టణంలోని కడప రోడ్డులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి జెసి.అస్మిత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభల్లో లోకేష్‌ ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వైట్‌ కాలర్‌ నేరస్తడన్నారు. క్రిమినల్‌ రికార్డులు ఉన్నత వరకు జగన్‌ ఉంటాడని ఎద్దేవా చేశారు. మద్యపానం నిషేదం, సిపిఎస్‌ రద్దు, జాబ్‌ క్యాలెండర్‌, 45 ఏళ్ల వారికి పింఛన్‌ తదితర హామీలను ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జగన్‌ ఓ చేత్తే రూ.10 ఇచ్చి మరో చేతో రూ.100 లాగేసుకుంటున్నారని విమర్శించారు. దగా పాలనకు స్వస్తి చెప్పడానికి ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఐక్యమత్యంగా నడుద్దామన్నారు. టిడిపికి కార్యకర్తలే బలం అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే టిడిపికి కంచుకోట అన్నారు. మా కుటుంబాన్ని భుజాలపై మొస్తున్న జిల్లాను మరింత అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు రాష్ట్రాన్ని లూటీ చేశారన్నారు. ఏ తప్పూ చేయని టిడిపి నాయకులపై దొంగ కేసులు పెట్టారన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి 52 రోజులు జైల్లో పెట్టారన్నారు. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే జగన్‌ శాశ్వతంగా జైల్లోనే ఉంటాడన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలేది లేదన్నారు. సూపర్‌-6తో ప్రజలందరికీ మేలు చేస్తామన్నారు. మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. మసీదులకు రంగులు వేయడానికి ఇచ్చే కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తామని తెలియజేశారు. మౌజన్లకు గౌరవేతనం కల్పిస్తామన్నారు. బీసీలకు శాశ్వత కులధ్రువీకరణ పత్రం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానున్న రెండు నెలలు టిడిపి, జనసేనికులు నిరంతరాయంగా కష్టపడి ప్రజలను కలవాలన్నారు. సూపర్‌-6ని ప్రజల్లోకి తీసుకెళ్లి తెలుగుదేశం విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్‌, మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసి ప్రభాకర్‌ రెడ్డి, తెలుగుదేశం నాయకులు జెసి పవన్‌ కుమార్‌ రెడ్డి, తాడిపత్రి జనసేన నియోజకవర్గం ఇన్‌ఛార్జి శ్రీకాంత్‌ రెడ్డితో పాటు టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతలో టిడిపి జెండాను ఎగురవేద్దాం

వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి

     వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగురవేసేలా అందరూ ఉమ్మడిగా శ్రమిద్దామని టిడిపి అర్బన్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి పిలుపునిచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి దౌర్జన్యకాండ సాగిస్తూ భయానక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నేనున్నానంటూ యువనేత నారా లోకేష్‌ యువగళం పేరుతో పాదయాత్ర చేసి యువతకు భరోసాను ఇచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారని తెలిపారు. రాష్ట్రానికి భవిష్యత్‌ నాయకుడిగా లోకేష్‌ నిలిచారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేసి అనంతపురంలో టిడిపి జెండాను ఎగురవేయడంలో సైనికుల్లా పని చేద్దామని టిడిపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తాడిపత్రి అభివృద్ధికి నిధులివ్వండి

జెసి.అస్మిత్‌రెడ్డి

         తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాడిపత్రి అభివృద్ధి కోసం కావాల్సిన నిధులను విడుదల చేయాలని జెసి.అస్మిత్‌రెడ్డి కోరారు. చాగల్లు పెండేకల్‌ లాంటి డ్యాములకు నీటి కేటాయింపులు చేయాలన్నారు. చేనేత కార్మికులకు ముడిసరుకులను సబ్సిడీపై ఇవ్వాలన్నారు. మూతపడిన నాపరాళ్ల గ్రానైట్‌ పరిశ్రమలను ఆదుకోవాలన్నారు.

టిడిపి, జనసేన మద్దతుదారుల తోపులాట

        అనంతపురం శంఖారావం సభా ప్రాంగణంలో టిడిపి జనసేన పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తోపులాట వాగ్వివాదం తలెత్తి కార్యకర్తలు ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. అక్కడే ఉన్న టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి నేతలకు సర్ధి చెప్పి ఘర్షణను అదుపు చేశారు. అనంతపురం అర్భన్‌ నియోజకవర్గం టికెట్‌ తమకంటే తమకంటూ జనసేన, టిడిపి మద్దతుదారులు ఘర్షణ పడ్డారు.

➡️